Rohit Sharma: రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్‌మెంట్ యూ-టర్న్‌పై కోచ్ గంభీర్ అసంతృప్తి !

- నాలుగో టెస్ట్ ముగిశాక రిటైర్ కావాలని నిర్ణయించుకొని వెనక్కి తగ్గడంపై అసంతృప్తి
- కెప్టెన్ నిర్ణయాన్ని గంభీర్ జీర్ణించుకోలేకపోతున్నాడంటున్న కథనాలు
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విఫలం కావడంతో రోహిత్ రిటైర్‌మెంట్ పై జోరుగా ప్రచారం
ఇటీవలే ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం కావడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ ముగిసినట్టేనంటూ జోరుగా కథనాలు వెలువడ్డాయి. ఈ మేరకు బీసీసీఐతో సంప్రదింపులు కూడా జరిపాడంటూ ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారంపై స్పందించిన రోహిత్... పరుగులు రాబట్టలేకపోతుండడంతోనే చివరి టెస్ట్ ఆడలేదని, అంతేకానీ రిటైర్‌మెంట్ నిర్ణయం కాదని క్లారిటీ ఇచ్చాడు. తద్వారా ఊహాగానాలకు తెరదించాడు.
నిజానికి మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ అనంతరం టెస్ట్ ఫార్మాట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడని, కానీ, తన శ్రేయోభిలాషులు కొందరు ఒత్తిడి చేయడంతో వెనక్కి తగ్గాడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. అయితే, రిటైర్‌మెంట్ నిర్ణయంపై రోహిత్ శర్మ యూ-టర్న్ తీసుకోవడంపై కోచ్ గౌతమ్ గంభీర్ చాలా అసంతృప్తిగా ఉన్నాడని తెలిపింది. రోహిత్ నిర్ణయాన్ని గంభీర్ జీర్ణించుకోలేకపోతున్నాడని వివరించింది.
కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ అత్యంత దారుణంగా విఫలమయ్యాడు. మూడు టెస్టులు ఆడిన అతడు 5 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి కేవలం 31 పరుగులు మాత్రమే సాధించాడు. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌లో డబుల్ డిజిట్ స్కోర్ చేశాడు. మిగతా అన్ని ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరాడు.