Balka Suman: తెలంగాణలో ఎప్పుడూ లేని విష సంస్కృతిని రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నారు: బాల్క సుమన్

Balka Suman fires at Revanth Reddy for attack on brs office

  • బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని ఆగ్రహం
  • ప్రశ్నిస్తే కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపాటు
  • బీఆర్ఎస్, బీజేపీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారన్న సుమన్

తెలంగాణలో ఎప్పుడూ లేని విషసంస్కృతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువస్తున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేసిన తీరును తాము ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు ఆస్కారం లేదన్నారు.

బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉందని, ఈ కాలంలో తాము దాడులకు పాల్పడి ఉంటే ఒక్క కాంగ్రెస్ కార్యాలయమైనా మిగిలి ఉండేదా? అని ప్రశ్నించారు. గతంలో హరీశ్ రావు రుణమాఫీ గురించి మాట్లాడితే... సిద్దిపేటలో ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేయించారని, మూసీ బాధితులకు కేటీఆర్ అండగా నిలబడినందుకు రాంనగర్ వద్ద కేటీఆర్ వాహనంపై దాడి చేయించారని, పాడి కౌశిక్ రెడ్డి ప్రజల తరఫున పోరాడుతున్నందున ఆయన ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి సహా సీనియర్ నేతలు ఖమ్మం పట్టణానికి వెళ్లినప్పుడు వారిపై కూడా దాడి జరిగిందన్నారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ఇలాంటి దాడుల సంస్కృతి పెరుగుతోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి దాడులు మేం చేసి ఉంటే కాంగ్రెస్ కార్యాలయాలు ఉండేవా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మొహబ్బత్ కీ దుకాణ్ అని మాట్లాడుతున్నారని, కానీ తెలంగాణలో మాత్రం కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల పైనే కాదు... మొన్న హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయంపై కూడా దాడి జరిగిందని విమర్శించారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికైనా చొరవ తీసుకొని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద పోలీసులు ఇష్టారీతిన కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మరి బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడి జరిగితే కాంగ్రెస్ కార్యకర్తలపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పోలీసులు దగ్గరుండి కార్యాలయంపై దాడి చేయించినట్లుగా కనిపిస్తోందన్నారు.

ప్రజల ఆశీర్వాదంతో మున్ముందు బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి అధికారులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని పారదర్శకంగా పని చేయాలని సూచించారు. ఇలాంటి దాడులు జరగకుండా పీసీసీ చీఫ్ చర్యలు చేపట్టాలని లేదంటే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. పరిస్థితులు చేజారకముందే పీసీసీ చర్యలు తీసుకోవాలన్నారు. దాడులకు బదులు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్నారు.

  • Loading...

More Telugu News