Rohit Sharma: రోహిత్ ముంగిట అరుదైన రికార్డు.. వన్డేల్లో మరో 134 రన్స్ చేస్తే చాలు!

- మరో 134 రన్స్ చేస్తే అత్యంత వేగంగా 11వేల పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా అవతరణ
- ఇప్పటివరకు 257 ఇన్నింగ్స్‌లలో 10,866 పరుగులు చేసిన రోహిత్
- ఈ జాబితాలో 222 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించి టాప్‌లో ఉన్న కోహ్లీ
- ఆ తర్వాతి స్థానంలో సచిన్ టెండూల్కర్ (276 ఇన్నింగ్స్)
వన్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు ముంగిట ఉన్నాడు. హిట్‌మ్యాన్ మరో 134 రన్స్ చేస్తే... అత్యంత వేగంగా 11 వేల పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా నిలవనున్నాడు. ప్రస్తుతం ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (222 ఇన్నింగ్స్) టాప్‌లో ఉండగా... సచిన్ టెండూల్కర్ (276 ఇన్నింగ్స్), రికీ పాంటింగ్ (286 ఇన్నింగ్స్), సౌరవ్ గంగూలీ (288 ఇన్నింగ్స్), జాక్ కలిస్ (293 ఇన్నింగ్స్) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇక రోహిత్ ఇప్పటివరకు 257 ఇన్నింగ్స్‌లలో 10,866 పరుగులు చేశాడు. మరో 19 ఇన్నింగ్స్‌ల లోపే 134 రన్స్ చేసి, ఈ మైలురాయిని చేరుకుంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలుస్తాడు. కాగా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ వన్డే ఫార్మాట్‌లో ఆడనుంది.
ఆసక్తికరంగా విరాట్ తన 11వేల పరుగుల మైలురాయిని టీమిండియా కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే పూర్తి చేశాడు. ప్రస్తుతం వన్డే జట్టుకు నాయకత్వం వహిస్తూ రోహిత్ కూడా ఈ ఫీట్‌ను సాధించే అవకాశం ఉంది. ఇక 2007లో రోహిత్ వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేశాడు. కానీ, హిట్‌మ్యాన్ ఆ తర్వాత 6 సంవత్సరాలు జట్టులో స్థిరమైన చోటు సంపాదించలేకపోయాడు.
ఈ క్రమంలో ఎంఎస్ ధోనీ సారథ్యంలో 2013 ప్రారంభంలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం దక్కడం రోహిత్‌కు ఒక వరంగా మారింది. దాంతో అతను జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఏకంగా టీమిండియాకు సారథిగా ఎదిగాడు.