Durgam Cheruvu: దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు

- నాలుగు నెలల్లో ఈ చెరువు ఎఫ్‌టీఎల్‌తో పాటు బఫర్ జోన్‌ను ఫిక్స్ చేస్తామన్న రంగనాథ్
- ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని వెల్లడి
- శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేశాక తుది నివేదికను రూపొందిస్తామని వెల్లడి
త్వరలో దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ వివాదానికి తెరదించుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఈరోజు ఆయన హైడ్రా కార్యాలయంలో దుర్గం చెరువు పరిసరవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నాలుగు నెలల్లో ఈ చెరువు ఎఫ్‌టీఎల్‌తో పాటు బఫర్ జోన్‌ను నిర్ధారిస్తామని చెప్పారు.
ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా నాలుగు నెలల్లో శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను నిర్ణయిస్తామన్నారు. ఎఫ్‌టీఎల్ నిర్ధారణ విషయంలో సంబంధిత ప్రభుత్వ శాఖలతో పాటు ఐఐటీ, బిట్స్ పిలానీ, జేఎన్‌టీయూ వంటి విద్యా సంస్థల ఇంజినీర్లను కూడా భాగస్వామ్యం చేస్తామన్నారు.
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ తెలంగాణ, రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇలా అన్ని శాఖలను ఇందులో భాగస్వామ్యం చేసి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. శాటిలైట్ ఇమేజ్, సర్వే ఆఫ్ ఇండియా రికార్డులను శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేశాక తుది నివేదికను రూపొందిస్తామన్నారు.
ఇదిలా ఉండగా, దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి గతంలో హెచ్ఎండీఏ ఇచ్చిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై పరిసర ప్రాంతాల నివాసితుల అభ్యంతరాలను రంగనాథ్ పరిశీలించారు. ఆ తర్వాత వారి వాదనలను రికార్డ్ చేశారు. ఈ సమావేశంలో ఆరు కాలనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.