Ganji Kavitha: నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ కవితపై వేటు

- గంజి కవితపై అవినీతి ఆరోపణలు
- ఆమె అక్రమాలపై లేఖ విడుదల చేసిన సొంత శాఖ సిబ్బంది
- సమగ్ర విచారణ తర్వాత ఆమెను సస్పెండ్ చేసే అవకాశం
నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అవినీతి, అక్రమ వసూళ్ల ఆరోపణల మీద ఆమెపై చర్యలు తీసుకున్నారు.
గంజి కవితపై సొంత శాఖ సిబ్బందే ఉన్నతాధికారులకు లేఖ రాయడం గమనార్హం. ఆమె అక్రమాలను పేర్కొంటూ ఏకంగా 9 పేజీల లేఖను వారు విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగ్ ల కోసం ఆమె లంచాలు వసూలు చేసినట్టు లేఖలో వారు పేర్కొన్నారు. సిబ్బందితో అధిక వడ్డీ, రియలెస్టేట్ వ్యాపారం చేయించారని తెలిపారు. ఈ క్రమంలోనే ఆమెపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఆమె ఏడేళ్లు పని చేశారు. ఈ కాలంలో ఆమె గుట్కా, రేషన్ మాఫియాల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడినట్టు సమాచారం. సొంత సిబ్బందిని కూడా ఆమె వదల్లేదని చెపుతున్నారు. నలుగురు కానిస్టేబుళ్లతో ఆమె దందా నడిపించినట్లు తెలుస్తోంది. సమగ్ర విచారణ అనంతరం ఆమెను సస్పెండ్ చేసే అవకాశం ఉంది.