Blue Sun: 200 ఏళ్ల క్రితం సూర్యుడు నీలిరంగులో ఎందుకు కనిపించాడు?.. ఎట్టకేలకు బయటపడిన రహస్యం!

Scientists finally solved mystery of Sun turning blue in Earth atmosphere almost 200 years ago

  • భారీ అగ్నిపర్వత విస్ఫోటనమే కారణమన్న శాస్త్రవేత్తలు
  • అగ్నిపర్వతం నుంచి వాతావరణంలో మేటలు వేసిన సల్ఫర్ డయాక్సైడ్
  • ఈ కారణంగానే భూమి నుంచి రంగు మారి కనిపించిన సూర్యుడు

దాదాపు 200 ఏళ్ల క్రితం భూమి నుంచి సూర్యుడు నీలి రంగులో కనిపించాడు. అయితే, ఎంతోకాలంగా రహస్యంగా ఉన్న ఈ సైన్స్ దృగ్విషయాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. 1831లో భూమిపై సంభవించిన భారీ అగ్నిపర్వత విస్ఫోటనమే ఇందుకు కారణమని తేల్చారు. అగ్నిపర్వతం పేలుడు నుంచి ఎగసిపడిన సల్ఫర్ డయాక్సైడ్ భూవాతావరణంలోకి ప్రవేశించి భారీగా విస్తరించి మేటలు వేసిందని, అందుకే భూమి నుంచి చూస్తే సూర్యుడు నీలి రంగులో కనిపించాడని శాస్త్రవేత్తలు తేల్చారు.

అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగానే ఆ ఏడాది భూగ్రహంపై వాతావరణం చల్లబడిందని, కొన్ని విచిత్రమైన మార్పులు సంభవించాయని వివరించారు. ఈ మేరకు ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (పీఎన్ఏఎస్) జర్నల్‌లో ఒక అధ్యయనం ప్రచురితమైంది. స్కాట్‌లాండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో ఈ విషయాలను నిర్ధారించారు. 1831లో వాతావరణ రికార్డులు అన్నింటిని విస్తృతంగా విశ్లేషించిన తర్వాత ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

అగ్నిపర్వతం నుంచి, మంచు అంతర్భాగం నుంచి సేకరించిన రెండు బూడిదలను ల్యాబ్‌లో కలిపి విశ్లేషించగా అసలు విషయం బయటపడిందని అధ్యయన సహ-రచయిత విల్ హచిసన్ వివరించారు. సూర్యుడు నీలిరంగులో కనిపించడానికి కారణాన్ని తెలుసుకున్నామని చెప్పారు.

కాగా, ప్రస్తుతం రష్యా, జపాన్ మధ్య ఉన్న వివాదాస్పద భూభాగంలో ఉన్న సిముషీర్ ద్వీపంలోని ‘జవారీట్‌స్కీ’ అనే అగ్నిపర్వతం 1831లో పేలింది. ఈ ప్రకృతి విపత్తుకు సంబంధించిన వివరాలను ఎవరూ రాతపూర్వకంగా నమోదు చేయలేదు. విస్ఫోటనం సంభవించిన ద్వీపం చాలా దూరంలో ఉండడం, ఆ ప్రాంతంలో జనావాసాలు కూడా లేకపోవడంతో ఆ రోజుల్లో ఎవరూ అంతగా పట్టించుకోలేదు. 

  • Loading...

More Telugu News