ministers committee: భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు మళ్లీ 500 ఎకరాల కేటాయింపుకు మంత్రుల కమిటీ

- 500 ఎకరాలు కేటాయిస్తే ప్రపంచ స్థాయి ఏవియేషన్ హబ్‌ను అభివృద్ధి చేస్తామన్న భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ సంస్థ
- ఆర్ధిక మంత్రి అధ్యక్షతన మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న మంత్రుల కమిటీ
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు 500 ఎకరాలు కేటాయించే అంశంపై ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీని నియమించింది. గతంలో భోగాపురం విమానాశ్రయానికి ఆర్ఎఫ్‌పీలో 2,703.26 ఎకరాలను ప్రతిపాదించగా, గత జగన్ సర్కార్ 500 ఎకరాలు తగ్గించి 2,203.26 ఎకరాలను కేటాయించింది.
ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్టుకు ఆనుకుని ఉన్న 500 ఎకరాలు కేటాయిస్తే ప్రపంచ స్థాయి ఏవియేషన్ హబ్ ను అభివృద్ధి చేస్తామని, దాన్నో పట్టణంలా అభివృద్ధి చేస్తామంటూ భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ సంస్థ జీఎంఆర్ .. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ (జీవీఐఏఎల్) ప్రభుత్వానికి తాజాగా విజ్ఞప్తి చేసింది.
దీనిపై స్పందించిన ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీని నియమించింది. ఆర్దిక మంత్రి అధ్యక్షుడుగా, మౌలిక వసతుల శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదక సమర్పించనుంది.