IRE Women vs IND Women: తొలి వన్డేలో టీమిండియా విజయం.. రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- రాజ్‌కోట్ వేదికగా భారత్, ఐర్లాండ్ తొలి వన్డే
- 239 పరుగుల లక్ష్యాన్ని 34.3 ఓవర్లలోనే ఛేదించిన టీమిండియా
- హాఫ్ సెంచరీలతో రాణించిన ప్రతికా రావల్ (89), తేజల్ హసబ్నిస్ (53)
- 41 రన్స్‌తో బ్యాట్ ఝుళిపించిన కెప్టెన్ స్మృతి మంధాన
- అత్యంత వేగంగా 4వేల రన్స్ పూర్తిచేసుకున్న తొలి భారత ప్లేయర్‌గా స్మృతి రికార్డు
రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 239 పరుగుల లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 34.3 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య భారత్ 1-0 తేడాతో ముందంజలో నిలిచింది.
టీమిండియా బ్యాటర్లలో ప్రతికా రావల్ (89), తేజల్ హసబ్నిస్ (53) హాఫ్ సెంచరీలతో రాణించారు. అలాగే కెప్టెన్ స్మృతి మంధాన 41 రన్స్‌తో బ్యాట్ ఝుళిపించింది. పవర్‌ప్లేలో దాటిగా ఆడి, ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఇక 89 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతికా రావల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
స్మృతి పేరిట అరుదైన రికార్డు
ఈ మ్యాచ్‌లో 29 బంతుల్లోనే 41 పరుగులు చేసిన స్మృతి మంధాన అరుదైన రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా (95 మ్యాచులు) 4వేల వన్డే రన్స్ పూర్తిచేసుకున్న తొలి భారత ప్లేయర్‌గా నిలిచింది. ఓవరాల్‌గా మూడో క్రీడాకారిణిగా ఘనత సాధించారు. ఆసీస్‌కు చెందిన బిలిందా క్లార్క్(86 మ్యాచులు), మిగ్ లానింగ్ (87 మ్యాచులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. గతంలో భారత మాజీ ప్లేయర్ మిథాలీరాజ్ 112 వన్డేల్లో ఈ ఫీట్ సాధించడం జరిగింది.