Harish Rao: హరీశ్ రావును 28వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దు: పోలీసులకు హైకోర్టు ఆదేశాలు
- హరీశ్ రావుపై పంజాగుట్ట పీఎస్‌లో చక్రధర్ గౌడ్ ఫిర్యాదు
- కేసు నమోదు కావడంతో హైకోర్టులో హరీశ్ రావు క్వాష్ పిటిషన్
- హరీశ్ రావును 28వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఆదేశాలు
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు తాత్కాలిక ఊరట లభించింది. పంజాగుట్ట పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని, అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో హరీశ్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గతంలో విచారించిన న్యాయస్థానం... హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఈరోజు నేడు మరోసారి ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.
కౌంటర్ దాఖలు చేయాలని ఫిర్యాదుదారు చక్రధర్ గౌడ్‌కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో హరీశ్ రావుపై చక్రధర్ గౌడ్ పోటీ చేశారు. అయితే హరీశ్ రావు కక్షకట్టి తనను క్రిమినల్ కేసుల్లో ఇరికించారని, తన ఫోన్‌ను ట్యాప్ చేయించారని ఆరోపిస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో హరీశ్ రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.