Fun Bucket Bhargav: తెలుగు యూట్యూబర్‌కు 20 ఏళ్ల జైలు
- మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో విశాఖ ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు
- యూట్యూబర్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు.. బాధితురాలికి రూ. 4లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశం
- 'ఫన్ బకెట్' పేరుతో వీడియోలు చేసి పాప్యులర్ అయిన భార్గవ్
తెలుగు యూట్యూబర్ భార్గవ్‌కు విశాఖపట్నం కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 14 ఏళ్ల ఓ బాలికపై లైంగిక దాడి కేసులో విశాఖ ప్రత్యేక పోక్సో కోర్టు ఈ తీర్పును వెల్లడించింది. బాధితురాలికి రూ. 4లక్షల నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఆదేశించింది.
కాగా, భార్గవ్ 'ఫన్ బకెట్' పేరుతో వీడియోలు చేసి పాప్యులర్ అయ్యాడు. ఈ క్రమంలో తనతో నటించే ఓ బాలికపై అతడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాంతో బాలిక గర్భం దాల్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
విశాఖపట్నం నగర మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు. పోలీసులు ఛార్జ్‌షీట్‌తో పాటు సాక్ష్యాలను న్యాయస్థానంలో సమర్పించారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాలను పరిశీలించిన విశాఖ ప్రత్యేక పోక్సో కోర్టు నిందితుడు భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు బాధితురాలికి రూ. 4లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చింది.