Varun Aaron: టీమిండియా మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ క్రికెట్‌కు రిటైర్మెంట్

Former India Pacer Varun Aaron Retires from All Forms of Cricket

  • అన్ని ఫార్మాట్ల‌ క్రికెట్ నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్రకటించిన మాజీ ఫాస్ట్ బౌలర్ 
  • భార‌త్‌ త‌ర‌ఫున 9 టెస్టులు, 9 వ‌న్డేలకు ప్రాతినిధ్యం
  • మొత్తం 29 వికెట్లు తీసిన వరుణ్ ఆరోన్

టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. అన్ని ఫార్మాట్ల‌ క్రికెట్ నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్రకటించాడు. ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ప్ర‌త్యేక పోస్టు పెట్టాడు. గత 20 ఏళ్లు క్రికెట్‌తో గ‌డిచిపోయాయ‌ని, ఇవాళ్టి నుంచి తాను అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు వరుణ్ ఆరోన్ చెప్పుకొచ్చాడు.   

"గత 20 సంవత్సరాలుగా నేను ఫాస్ట్‌ బౌలింగ్ చేసే హడావిడిలో బ‌తికేశాను. అందులోనే శ్వాస తీసుకున్నాను. ఈ రోజు అపారమైన అనుభ‌వం, కృతజ్ఞతతో నేను అన్ని ఫార్మాట్ల‌ క్రికెట్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాను. ఫాస్ట్ బౌలింగ్ నా మొదటి ప్రేమ. ఇవాళ నేను మైదానం నుంచి  బయటికి వచ్చినప్పటికీ, ఎల్లప్పుడూ నేను దానిలో భాగమే" అని రాసుకొచ్చాడు.

ఇక వరుణ్‌ ఆరోన్ 2010-11 విజయ్ హజారే ట్రోఫీ ద్వారా వెలుగులోకి వ‌చ్చాడు. 21 సంవత్సరాల వయస్సులో గంటకు 150 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బంతులు విసిరి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. కాగా, ఆరోన్ టీమిండియా త‌ర‌ఫున 9 టెస్టులు, 9 వ‌న్డేలు ఆడాడు. చివరిసారిగా 2015 నవంబర్ లో దక్షిణాఫ్రికాపై బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వ‌హించాడు. మొత్తం 29 వికెట్లు తీశాడు.

కాగా, దేశవాళీ క్రికెట్‌లో ఆరోన్ 88 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 26.47 సగటు, 5.44 ఎకానమీ రేటుతో 141 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక టీ20లలో అతను 95 మ్యాచ్‌ల‌లో 8.53 ఎకానమీ రేటుతో 93 వికెట్లు సాధించాడు. అలాగే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో తొమ్మిది సీజ‌న్‌లు ఆడాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 

  • Loading...

More Telugu News