YS Sharmila: ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ వెన్నుపోటు: వైఎస్ షర్మిల
- రాష్ట్ర ప్రజలను మోదీ దారుణంగా మోసం చేశారన్న షర్మిల
- విశాఖ పర్యటనలో విభజన హామీలపై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శ
- మోదీతో సీఎం చంద్రబాబుది సక్రమ సంబంధమైతే జగన్‌ది అక్రమ సంబంధమని వ్యాఖ్య
- మన దేశాన్ని రక్షించుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరమన్న షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. హోదా ఇస్తామని మోసం చేశారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసిన మోదీతో సీఎం చంద్రబాబుది సక్రమ సంబంధమైతే జగన్‌ది అక్రమ సంబంధమని షర్మిల విమర్శించారు. ఈ మేరకు ఏపీసీసీ చీఫ్ ట్వీట్ చేశారు.
"ఏపీ ప్రజలను ప్రధాని మోదీ దారుణంగా వెన్నుపోటు పొడిచారు. హోదా ఇస్తామని మోసం చేశారు. మొన్న మోదీ విశాఖ వచ్చినప్పుడు కనీసం విభజన హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విశాఖ స్టీల్ మీద ఎటువంటి ప్రకటన లేదు. ప్రైవేటీకరణ మీద వైఖరి ఏంటో చెప్పలేదు. ఉత్తరాంధ్ర-రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ నిధులు గురించి మాట్లాడలేదు. కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. అలాంటి పార్టీతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇదెక్కడి న్యాయం.
ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేసిన మోదీతో చంద్రబాబుది సక్రమ సంబంధం అయితే... జగన్‌ది అక్రమ సంబంధం. బడుగు బలహీన వర్గాల ఓట్లతో గెలిచిన జగన్... రాజశేఖర్ రెడ్డి ఆశయాలను గంగలో కలుపుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు మతతత్వ బీజేపీని నిరంతరం వ్యతిరేకించారు. ఆయన వారసులమని చెప్పుకునే జగన్ బీజేపీతో ఎందుకు కొమ్ముకొస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి వారసుల్లో బీజేపీని వ్యతిరేకిస్తుంది నేను మాత్రమే. ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మన దేశాన్ని రక్షించుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరం" అని షర్మిల పేర్కొన్నారు.