Game Changer Movie: 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్' సినిమాల అదనపు షోలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల షోలకు అనుమతి నిరాకరించిన ఏపీ ప్రభుత్వం
- 10 రోజుల పాటు ఐదు షోలకు మించకుండా ప్రదర్శించుకోవచ్చన్న హైకోర్టు
- హైకోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్వులను సవరించిన ప్రభుత్వం
రామ్ చరణ్ మూవీ 'గేమ్ ఛేంజర్' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న బాలకృష్ణ సినిమా 'డాకు మహారాజ్' విడుదల కాబోతోంది. ఈ రెండు చిత్రాల అదనపు షోలు, టికెట్ ధరల పెంపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈనెల 4వ తేదీన ఇచ్చిన మెమో కేవలం టికెట్ ధరలకు సంబంధించినది మాత్రమేనని ప్రభుత్వం తెలిపింది.
అయితే, సరైన భద్రత లేని థియేటర్లకు వచ్చే జనాలను నియంత్రించడం కష్టమని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటలకు అదనపు షోలకు అనుమతి నిరాకరించింది. 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు మించకుండా ప్రదర్శించుకోవచ్చని... ఐదు షోలలో ఒకటి బెనిఫిట్ షోగా నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.