RS Praveen Kumar: రేవంత్ రెడ్డి ఈరోజు మాట్లాడింది.. ఐదేళ్ల క్రితమే కేటీఆర్ మాట్లాడారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar blames Revanth Reddy

  • కేటీఆర్ మొబిలిటీ వ్యాలీ ఐడియాను రేవంత్ రెడ్డి తస్కరించారని విమర్శ
  • కేటీఆర్ ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌ను తీసుకువస్తే అవినీతి అంటున్నారని ఆగ్రహం
  • ప్రభుత్వ పాలసీల మీద అక్రమ కేసులు పెడితే ఎలా? అని నిలదీత

నేటి సీఐఐ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆద్యంతం ఎలక్ట్రిక్ వాహనాల గురించే మాట్లాడారని, కానీ అయిదేళ్ల క్రితమే కేటీఆర్ వీటిపై జీవోలు తీసుకు వచ్చారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేటీఆర్ మొబిలిటీ వ్యాలీ ఐడియాను రేవంత్ రెడ్డి కవర్ పేజీ మార్చి భలే తస్కరించారని ఎద్దేవా చేశారు.

ఇండస్ట్రీలో బజ్ సృష్టించేందుకే కేటీఆర్ ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌ను హైదరాబాద్‌కు తీసుకు వచ్చారని, కానీ దానిని కాంగ్రెస్ వాళ్లు అవినీతి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై వారు ఎలాంటి చర్చకు సిద్ధంగా లేరని విమర్శించారు. రేవంత్ రెడ్డి చెబుతున్న ఫ్యూచర్ సిటీకి, కేటీఆర్ ఇదివరకే చెప్పిన మొబిలిటీ వ్యాలీకి తేడా ఏమిటో చెప్పాలని నిలదీశారు.

ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలే... గతంలో కేటీఆర్ మాట్లాడారన్నారు. కేటీఆర్ మాట్లాడితే తప్పు... మీరు మాట్లాడితే ఒప్పా? అని ప్రశ్నించారు. మీరు రోజూ కక్ష సాధింపు చర్యకు పాల్పడుతూ ప్రభుత్వ పాలసీల మీద అక్రమ కేసులు పెట్టుకుంటూ వెళితే ఎలా? అని నిలదీశారు. ఇలా చేస్తే ఏ కంపెనీ పెట్టుబడులు పెడుతుందని ప్రశ్నించారు. పారిశ్రామిక అభివృద్ధి అంటే రేవంత్ రెడ్డి తన బినామీలకు, బంధువులకు అప్పజెప్పినంత ఈజీ కాదని చురక అంటించారు.

  • Loading...

More Telugu News