Team India: కాస్త విరామం ఇవ్వండి.. బీసీసీఐని కోరిన స్టార్ బ్యాటర్!

Star Indian batter KL Rahul has asked for a break for the England white ball series

  • స్వదేశంలో ఇంగ్లాండ్ సిరీస్‌కు విశ్రాంతి కోరిన కేఎల్ రాహుల్
  • వెల్లడించిన బీసీసీఐ వర్గాలు
  • జట్టుని ఎంపిక చేసేందుకు శనివారం సమావేశం కానున్న సెలక్టర్లు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముగిసిపోవడంతో ప్రస్తుతం టీమిండియా దృష్టి మొత్తం ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025పైనే ఉంది. ఈ మెగా ఈవెంట్‌కు ముందు భారత్ జట్టు అత్యంత కీలకమైన ఒక ద్వైపాకిక్ష సిరీస్ ఆడనుంది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో ఐదు టీ20లు, 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. 

ఛాంపియన్స్ ట్రోఫీకి కచ్చితంగా ఎంపికవుతాడని భావిస్తున్న స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని సమాచారం ఇచ్చాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. 

కాగా, 2022 ప్రపంచకప్ తర్వాత కేఎల్ రాహుల్ ఒక్క టీ20 మ్యాచ్‌ కూడా ఆడలేదు. కొన్ని వన్డే మ్యాచ్‌లు మాత్రం ఆడాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో కూడా ఆడి అద్భుతంగా రాణించాడు. అయితే, రోడ్డు ప్రమాద గాయాల నుంచి కోలుకొని రిషబ్ పంత్ జట్టులోకి తిరిగి రావడంతో వన్డే ఫార్మాట్‌లో కేఎల్ రాహుల్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే సిరీస్‌లో అతడు విశ్రాంతి కోరడం ఆసక్తికరంగా మారింది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్న తరుణంలో విశ్రాంతి కోరడం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం ‘విజయ్ హజారే ట్రోఫీ’లో నాకౌట్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. జనవరి 11న నాలుగవ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బరోడాతో కర్ణాటక తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో కర్ణాటక తరపున ప్రాతినిధ్యం వహించాల్సి ఉన్నా విశ్రాంతి ఇవ్వాలని ఆ రాష్ట్ర క్రికెట్ బోర్డును కోరినట్టు తెలుస్తోంది. 

ఇదిలావుంచితే, ఇంగ్లాండ్, ఛాంపియన్స్ ట్రోఫీలకు జట్లను ఎంపిక చేసేందుకు సెలక్టర్లు శనివారం సమావేశమవనున్నారని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎవరెవరికి చోటు దక్కనుందనేది ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News