Jagan: ఇది ప్రభుత్వం చేసిన తప్పు... ఒక్కొక్కరికి రూ.50 లక్షలు ఇవ్వండి: జగన్ డిమాండ్
- తిరుపతిలో తొక్కిసలాట
- స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన జగన్
- ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలని డిమాండ్
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రాల వద్ద నిన్న రాత్రి జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జగన్ స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులతో మాట్లాడారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చికిత్స తీరుతెన్నులపై ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇది ప్రభుత్వం చేసిన తప్పు అని, ప్రభుత్వ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని విమర్శించారు. ఈ ఘటనకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ప్రభుత్వం కారణంగానే గాయాలపాలయ్యారు కాబట్టి, వారందరికీ ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందించాలని అన్నారు. వారు కోలుకున్నాక ఇంటికి పంపించేటప్పుడు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇచ్చి పంపించాలని జగన్ పేర్కొన్నారు.