KTR: నాపై పెట్టిన కేసుల గురించి ఏసీబీకి కూడా అర్థమైంది: కేటీఆర్
- ఏసీబీ అధికారులు 82 ప్రశ్నలు వేశారన్న కేటీఆర్
- ఈ కేసులో ఎలాంటి విషయమూ లేదని వెల్లడి
- వంద కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధమేనని స్పష్టీకరణ
రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఏసీబీకి కూడా అర్థమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏసీబీ అధికారులు తనను అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగారని... అలా 82 ప్రశ్నలు వేశారన్నారు. ఈ కేసులో ఎలాంటి విషయమూ లేదన్నారు. పార్ములా ఈ-రేస్ అనే దానిని తాము తొలిసారి భారత్‌కు తీసుకు వచ్చామన్నారు. ఏసీబీ విచారణ ముగిసిన అనంతరం ఆయన బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లారు.
అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో... కేసీఆర్ నేతృత్వంలో ఎంతో నిబద్ధతతో, ఎక్కడా అవినీతి లేకుండా పని చేశామన్నారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ హైదరాబాద్‌లో కొనసాగించాలని భావించామని, అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే తెలంగాణకు భవిష్యత్తులో ఈవీ రంగంలో పెట్టుబడులు వస్తాయనే ఉద్దేశంతో పనిచేశామన్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు.
అవినీతి పనులు తాము చేయబోమని... చేయాల్సిన అవసరం కూడా తమకు లేదన్నారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా హాజరవుతానని స్పష్టం చేశారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పానన్నారు. ఇలాంటివి ఇంకో వంద కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి తాము సిద్ధమన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా... ఇబ్బందులకు గురి చేసినా ప్రజా సమస్యలపై పోరాడుతామన్నారు.