Viral News: ఇలా కూడా మోసం చేస్తారా? .. పెళ్లి వేదికల పేరుతో 17 జంటలను మోసం చేసిన భారత సంతతి మహిళ

Indian origin South Woman scammed 17 couples by taking money from them for the same venue on same day

  • దక్షిణాఫ్రికాలో ప్రిలిన్ మోహన్‌లాల్ అనే భారత సంతతి మహిళ ఘరానా మోసం
  • ఒకే ఫంక్షన్ హాల్‌ను ఒకే రోజు 17 జంటలకు ఫేక్ బుకింగ్ చేసిన వైనం
  • పెళ్లి వేదికకు చేరుకొని షాక్‌కు గురైన జంటలు
  • నిందితురాలిని గుర్తించిన ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ
  • కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసు అధికారులు

ఒకే రోజు ఒకే కళ్యాణ మండపాన్ని ఏకంగా 17 జంటల వివాహాలకు బుక్ చేసింది ఓ కిలాడీ లేడీ. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము కూడా వసూలు చేసింది. అంతా సిద్ధం.. పెళ్లి చేసుకోవడమే తరువాయి... అని భావించి కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్న జంటలకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. వేదిక నిర్మానుష్యంగా ఉండడమే కాకుండా కనీసం విద్యుత్, నీటి సౌకర్యాలు కూడా లేవని తెలిసి అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అనూహ్య పరిణామంతో జంటల పెళ్లిళ్లు కూడా రద్దయ్యాయి. 

ప్రిలిన్ మోహన్‌లాల్ అనే భారత సంతతి మహిళ దక్షిణాఫ్రికాలో ఈ ఘరానా మోసాలకు పాల్పడినట్టు తేలింది. ఆమెకు ఏమాత్రం సంబంధం లేని ఒక ఫంక్షన్ హాల్‌ పేరు చెప్పి ఈ మోసాలకు పాల్పడినట్టు నిర్ధారణ అయింది.

తమకు ఎదురైన ఈ అవమానకర ఘటన విషయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ జంట నిందిత మహిళ ప్రిలిన్ మోహన్‌లాల్‌ జాడను గుర్తించాలంటూ గతేడాది డిసెంబర్‌లో ప్రైవేటు భద్రతా సంస్థ ‘రియాక్షన్ యూనిట్ సౌతాఫ్రికా’ను (ఆర్‌యూఎస్ఏ) ఆశ్రయించింది. దీంతో, ప్రిలిన్ భండారం మొత్తం బయటపడింది. నిందితురాలిని ఇదివరకే గుర్తించినప్పటికీ మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఫేస్‌బుక్ వేదికగా వివరాలు ఆర్‌యూఎస్ఏ అధికారులు వెల్లడించారు. ప్రిలిన్ మోహన్‌లాల్ వయసు 53 సంవత్సరాలని, ఆమె ఒక బహిష్కృత న్యాయవాది అని, మోసాలకు పాల్పడిన ట్రాక్ రికార్డు ఆమెకు ఉందని చెప్పారు.

కాగా, తాను ఎలాంటి మోసాలకు పాల్పడలేదని ప్రిలిన్ మోహన్‌లాల్ చెబుతోంది. వ్యాపారపరంగా తాను సంక్లిష్టమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, వివాహాలు రద్దు చేసుకున్న జంటలకు తిరిగి డబ్బులు చెల్లించడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. డబ్బులు పూర్తి వాపసు చేస్తానంటూ అన్ని జంటలకు లేఖలు రాశానని ఆమె అంటోంది. అక్టోబర్‌లో డబ్బులు చెల్లించాల్సి ఉన్నా సకాలంలో చెల్లించలేకపోయానని ఆమె పేర్కొంది. మొత్తం తొమ్మిది జంటల నుంచి 60,000 రాండ్స్ తీసుకున్నట్టు చెప్పారని స్థానిక మీడియా పేర్కొంది.

  • Loading...

More Telugu News