Garikapati: తిరుపతి విషాదం వేళ వైరల్ గా మారిన గరికపాటి పాత వీడియో

Garikapati Viral Video

  • అదే రోజు, అదే ముహూర్తంలో దర్శనం చేసుకోవాలంటే ప్రమాదాలు జరుగుతాయన్న గరికపాటి
  • ఫలానా ముహూర్తంలో తప్పకుండా భగవంతుడి దర్శనం చేసుకోవాలనేంలేదని వ్యాఖ్య
  • శరీరాన్ని మించిన క్షేత్రంలేదు.. మనస్సును మించిన తీర్థంలేదన్న గరికపాటి

తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం భక్తులు పోటెత్తడం, క్యూలైన్ లో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు చనిపోవడం తెలిసిందే. ఈ విషాద ఘటన నేపథ్యంలో ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గరికపాటి ప్రవచనం చెబుతూ భగవంతుడి దర్శనానికి ముహుర్తాలు, పుణ్య తిథులు లేవని, ఫలానా రోజే, ఫలానా ముహుర్తానికే వెళ్లాలని ఏమీ లేదని చెప్పడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ముక్కోటి ఏకాదశికి భక్తులంతా తిరుపతిలోనే ఉంటారని, ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తుతారని గుర్తుచేశారు. అదే రోజు, అదే ముహూర్తంలో దర్శనం చేసుకోవాలని ఎగబడితే ప్రమాదాలే జరుగుతాయని గరికపాటి చెప్పారు.

ముక్కోటి ఏకాదశికి ఆలయాలకు పోటెత్తడం సరికాదని, ఆ మరుసటి రోజు లేదా రెండు మూడు రోజులు ఆగి వెళ్లడం వల్ల ఎలాంటి దోషం లేదని గరికపాటి చెప్పారు. ఆలస్యంగా వచ్చావని దేవుడు ఏమీ శపించడని అన్నారు. మనస్సు నిండా మట్టి నింపుకుని ఆ రోజే చూడాలి, ఏదేమైనా వెళ్లాలని అనుకోవడం పిచ్చితనమని అన్నారు. పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, తిథులు ఇవేవీ ముఖ్యం కావని చెప్పుకొచ్చారు. ‘శరీరాన్ని మించిన క్షేత్రం, మనస్సును మించిన తీర్థం లేవు.. సత్ప్రవర్తన కలిగి ఉంటే నీకు నువ్వే ఓ పుణ్యక్షేత్రం, నీకు నువ్వే ఓ పుణ్య తీర్థం’ అని గరికపాటి పేర్కొన్నారు.

Garikapati
Pravachanam
Tirupati
Viral Videos
Stampade

More Telugu News