KTR: విచారణ తర్వాత కేటీఆర్ ను ఇంటికి పంపిస్తారా? లేక అరెస్ట్ చేస్తారా?
- లాయర్ తో కలిసి ఏసీబీ విచారణకు వెళుతున్న కేటీఆర్
- ఏసీబీ అధికారులు 30 ప్రశ్నలు రెడీ చేసినట్టు సమాచారం
- కేటీఆర్ నివాసానికి చేరుకున్న కవిత, పలువురు నేతలు
- ఇప్పటికే హరీశ్ రావు గృహ నిర్బంధం
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కాసేపట్లో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. ఆయన విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు మొత్తం 30 ప్రశ్నలను రెడీ చేసినట్టు సమాచారం. కొన్ని గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగనుంది.
మరోవైపు, ఈనాటి విచారణ అనంతరం కేటీఆర్ ను ఇంటికి పంపిస్తారా? లేక ఆయనను అరెస్ట్ చేస్తారా? అనే టెన్షన్ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ప్రస్తుతం కేటీఆర్ నివాసం వద్ద ఉన్న బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు.
ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు కీలక బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ నివాసం వద్ద ఉన్నారు. కేసు విచారణను ఎలా ఎదుర్కోవాలి? ఏయే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? అనే విషయాలను లాయర్ రామచంద్రరావుతో వీరు చర్చిస్తున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.