Chandrababu: భక్తులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసీ.. ఏర్పాట్లు ఎందుకు చేయలేదు?: చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

Chandrababu fires at ttd officers for Tirupati stampade

  • డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీతో సీఎం టెలి కాన్ఫరెన్స్
  • ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై అసహనం
  • సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని, పునరావృతం కావొద్దని హెచ్చరించారన్న టీటీడీ చైర్మన్
  • తొక్కిసలాట ఘటనపై ఉన్నతస్థాయి దర్యాఫ్తు జరపాలన్న పురందేశ్వరి

వైకుంఠద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసి కూడా అందుకు తగినట్లుగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయన సమీక్షించారు. ఏపీ డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ సందర్భంగా అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ముందు జాగ్రత్త చర్యల్లో విఫలమయ్యారంటూ అధికారులపై మండిపడ్డారు. టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పునఃసమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.

క్షతగాత్రులకు అందుతున్న వైద్యం గురించి జిల్లా అధికారుల ద్వారా ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. విశాఖపట్నంలో ఓ మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో ఈ ఘటన జరగడం బాధాకరం అన్నారు. సీఎం చంద్రబాబు ఈరోజు తిరుపతి వచ్చి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తారు. 

చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు: చైర్మన్

తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ విచారకర ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. తిరుమలలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్ల తొక్కిసలాట జరిగిందన్నారు. కొందరు అధికారుల తప్పిదం వల్ల ఇలా జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని సీఎం హెచ్చరించారన్నారు. టీటీడీ చైర్మన్ రుయా ఆసుపత్రికి వెళ్లి.. క్షతగాత్రులను పరామర్శించారు.

ప్రమాద ఘటన నేపథ్యంలో పలువురు మంత్రులు హుటాహుటిన తిరుపతికి చేరుకున్నారు. క్షతగాత్రులకు సహాయ చర్యలు, వైద్య సేవల పర్యవేక్షణ కోసం వారు వెంటనే తిరుపతి వచ్చారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్ తిరుపతికి వచ్చారు. 

తొక్కిసలాట ఘటనపై పురందేశ్వరి స్పందన 

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భక్తులు మృతి చెందడంపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాఫ్తు జరిపి, బాధ్యతారహితంగా వ్యవహరించిన అందరి పైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, తొక్కిసలాట ఘటనకు కారణాలు తెలుసుకోవడానికి టీటీడీ అధికారులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. 

  • Loading...

More Telugu News