TTD: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై టీటీడీ సీరియస్
- తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన టీటీడీ
- సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ టీటీడీ మండిపాటు
- నిష్కాబేగం అనే ఉద్యోగి టీటీడీలో పని చేయలేదని స్పష్టీకరణ
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ సీరియస్ అయింది. టీటీడీపై అవాస్తవాలు ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ప్రజా సంబంధాల అధికారిణిగా నిష్కా బేగం అనే మహిళ పని చేశారని, ఆమె ఇంటిపై ఈడీ దాడులు చేసిందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని టీటీడీ స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ఆమె నివాసంలో నగలను స్వాధీనం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు నిజం కాదని తెలిపింది. నిష్కా బేగం అనే మహిళ ప్రజా సంబంధాల అధికారిగా ఎప్పుడూ పని చేయలేదని పేర్కొంది. గతంలో ఎక్కడో జరిగిన ఫోటోలను జత పరిచి టీటీడీ పేరును వాడటాన్ని ఖండించింది. భక్తులను తప్పుదోవ పట్టించి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలా అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.