BCCI: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర ఓటమిపై బీసీసీఐ సమీక్ష.. ఏం జరగబోతోంది?
- 1-3 తేడాతో సిరీస్ ఓడిపోవడంపై రివ్యూ నిర్వహించనున్న బీసీసీఐ పెద్దలు
- రోహిత్, కోహ్లీ, కోచ్ గౌతమ్ గంభీర్‌లపై చర్యలు ఉండకపోవచ్చని సమాచారం
- ఇటీవలే ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన దిగ్గజ బ్యాటర్లు
దాదాపు పదేళ్ల తర్వాత భారత జట్టు ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. 5 టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయారు. దీంతో 1-3 తేడాతో సిరీస్‌ను కోల్పోవాల్సి వచ్చింది. అయితే, ఈ విధంగా దారుణ రీతిలో ఓటమి పాలవ్వడంపై సమీక్ష నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. త్వరలోనే రివ్యూ చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అయితే, ఆస్ట్రేలియా సిరీస్‌లో దిగ్గజ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమైనప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు ఉండబోవని తెలుస్తోంది. అలాగే, కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని బీసీసీఐ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. విరాట్, రోహిత్‌లను ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక చేయనున్నారని, ఆ తర్వాత జూన్‌లో ఇంగ్లాండ్‌తో జరగనున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు సైతం సెలక్ట్ చేస్తారని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ‘‘రివ్యూ ఉంటుంది. కానీ, ఎవరిపైనా తొలగింపు వేటు ఉండదు. బ్యాటర్ల చెత్త ప్రదర్శన కారణంగా కోచ్‌ను తొలగించలేం కదా. గౌతమ్ గంభీర్ కోచ్‌గా కొనసాగుతారు’’ అని చెప్పారు.
గత దశాబ్ద కాలంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ భారత జట్టు టాపార్డర్‌లో కీలకంగా ఉన్నారు. నిరుడు టీమిండియా టీ20 వరల్డ్ కప్‌ను గెలవడంలో కూడా కీలక పాత్ర పోషించారు. అయితే, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మాత్రం ఇద్దరూ ఘోరంగా విఫలమయ్యారు. పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒక సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌లో కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఇక రోహిత్ శర్మ అయితే మరీ దారుణం. మొత్తం 5 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 31 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో హిట్‌మ్యాన్‌ను పక్కన కూర్చోబెట్టాల్సి వచ్చింది.