UGC: 'నెట్' అర్హత లేకుండానే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం.. యూజీసీ కీలక మార్పు!
- ముసాయిదా నిబంధనలు విడుదల చేసిన యూజీసీ
- సంబంధిత భాగస్వాములు 2025 ఫిబ్రవరి 5లోగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని విజ్ఞప్తి
- బోధన, అకడమిక్ స్టాఫ్ నియామకం, ప్రమోషన్లకు సంబంధించిన కొత్త నిబంధనల విడుదల
యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు, పదోన్నతులు పొందడానికి ఇన్నాళ్లూ అర్హతగా ఉన్న నెట్‌ను (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్) తొలగించాలని యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) నిర్ణయించింది. ఈ మేరకు ముసాయిదా నిబంధనలను మంగళవారం విడుదల చేసింది. సంబంధిత భాగస్వాములు 2025 ఫిబ్రవరి 5లోగా అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది.
బోధనా సిబ్బంది, అకడమిక్ స్టాఫ్ నియామకాలు, పదోన్నతులకు సంబంధించిన అర్హత ప్రమాణాలను సవరిస్తూ ముసాయిదా నిబంధనల్లో పేర్కొంది. కనీసం 55 శాతం మార్కులతో పోస్టుగ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగివున్నవారు అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎంట్రీ లెవల్) పోస్టుకు అర్హులు అవుతారని యూజీసీ పొందుపరిచింది. ప్రస్తుతానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు యూజీసీ నెట్ ఎగ్జామ్ తప్పనిసరిగా ఉంది.
కొత్త నిబంధనల్లో వైస్ ఛాన్సలర్ల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి. కొత్త నిబంధనల ప్రకారం... విద్య సంబంధ సంస్థలు, పరిశోధనా సంస్థలు, పబ్లిక్ పాలసీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రీలకు చెందిన నిపుణులను కూడా వీసీలుగా నియమించడానికి అవకాశం ఉంటుంది. ఈ మేరకు అర్హత ప్రమాణాలను విస్తరించింది. వీసీ నియామక ప్రక్రియలో భాగంగా ఆల్ ఇండియా వార్తాపత్రికలో ప్రకటన, పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.