Chandrababu: ఒక్క ఈ-మెయిల్ తో చంద్రబాబు నా సమస్యను పరిష్కరించారు.. ఎన్‌సీఎస్ఆర్‌సీ డైరెక్టర్ హరికృష్ణ

NCSRC director Hari Krishna said AP CM Chandrababu solved his problem with jus Rs 4

  • చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పటి నాటి ఘటన
  • ‘స్వర్ణకుప్పం విజన్-2029’ కార్యక్రమంలో గుర్తు చేసుకున్న హరికృష్ణ
  • ఏపీకి 100 కంపెనీలు రప్పించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని హామీ
  • సైబర్ రంగం ద్వారా ప్రభుత్వానికి రూ. 1000 కోట్ల ఆదాయం తెప్పిస్తానన్న వైనం
  • సైబర్ భద్రతలో ఏపీని నంబర్ వన్‌గా నిలుపుతానన్న చంద్రబాబు

నాలుగు రూపాయల ఖర్చుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఈ-మెయిల్ చేస్తే రెండు నెలల్లో తన సమస్య పరిష్కారమైందని జాతీయ సైబర్ భద్రతా పరిశోధన కౌన్సిల్ (ఎన్‌సీఎస్ఆర్‌సీ) డైరెక్టర్ పెనుమర్తి హరికృష్ణ గుర్తు చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో ‘స్వర్ణకుప్పం విజన్-2029’ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ముఖాముఖిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబునాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన జీతం రూ. 3 వేలని హరికృష్ణ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తనకో కష్టం వస్తే కేవలం నాలుగు రూపాయల ఖర్చుతో చంద్రబాబుకు ఈ-మెయిల్ చేస్తే రెండు నెలల్లోనే సమస్య పరిష్కరించారని తెలిపారు. ‘‘సీఎం ఎట్ ఏపీ జీవోవీ డాట్ ఇన్‌కు ఇటీవల మూడుసార్లు సంప్రదించినా స్పందన రాలేదు. ఇప్పుడు ఏపీకి నేను 100 కంపెనీలు రప్పించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తా. మీరు అవకాశం ఇస్తే సైబర్ రంగం ద్వారా ప్రభుత్వానికి రూ. 1000 కోట్ల ఆదాయం తెప్పిస్తా’’ అని హరికృష్ణ పేర్కొన్నారు. 

దీనికి స్పందించిన సీఎం చంద్రబాబు తన కార్యదర్శి ప్రద్యుమ్న మీతో మాట్లాడతారని హరికృష్ణకు చెప్పారు. అంతేకాదు, సైబర్ భద్రత సాంకేతిక బృందంలో ఆయనను సలహాదారుగా చేర్చుకుంటామని హామీ ఇచ్చారు. సైబర్ భద్రతలో ఏపీని నంబర్ వన్‌గా నిలుపుతానని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సహజంగానే కొన్ని అడ్డంకులు ఉంటాయని, అలాంటి సందర్భాల్లో మీలాంటి వ్యక్తులతో మాట్లాడడం కుదరదని, అయితే, ఇకపై ఇలాంటివి లేకుండా చూస్తానని హరికృష్ణకు చంద్రబాబు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News