ktr quash petition: కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడానికి గల కారణాలు ఇవేనా...?
- కేటిఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
- అరెస్టు నుంచి మినహాయింపు అభ్యర్ధన తిరస్కరణ
- ఎఫ్ఐఆర్‌పై విచారణను కొనసాగించాలన్న హైకోర్టు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటిఆర్ కు హైకోర్టులో చుక్కెదురైన విషయం తెలిసిందే. కేటిఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడానికి గల కారణాలను సుప్రీంకోర్టు న్యాయవాది శేషగిరిరావు ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
నార్మల్ కోర్సులో ఎఫ్ఐఆర్ మీద హైకోర్టు జోక్యం చేసుకోవడం అనేది రేర్ కేసులో మాత్రమే జరుగుతుంటుందని ఆయన పేర్కొన్నారు. కేటిఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహణ కోసం నాలుగైదు అగ్రిమెంట్ లు చేసుకోవాల్సి వచ్చింది. ఆ విషయంలో ఒకటి సక్సెస్ కావడంతో వాళ్లకు డబ్బులు చెల్లించాల్సి ఉండగా, ఈయన మంత్రిగా ఉన్న సమయంలో పరిపాలనా పరమైన ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా నేరుగా డబ్బులు విడుదల చేశారనేది, దీని వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగిందన్నది అభియోగం.
పరిపాలనా, ఆర్ధిక అనుమతులు లేకుండా డబ్బులు ఇవ్వకూడదు. దీనిపై ప్రస్తుత ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదు చేయడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే దర్యాప్తు ప్రారంభం కాకముందే కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టిందన్నారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌పై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా, తొలుత అరెస్టుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు .. తాజాగా క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది.
సుప్రీం కోర్టును ఆశ్రయించే వరకూ అయినా అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు చేసిన అభ్యర్ధనను సైతం హైకోర్టు తిరస్కరించింది. అనుమతులు లేకుండా నిధులు విడుదల చేసిన అంశానికి సంబంధించి ప్రాధమిక ఆధారాలు ఉన్నందున విచారణ కొనసాగించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. ప్రస్తుతం ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపిందన్నారు. నిబంధనలు ఉల్లంఘించి 90 లక్షల పౌండ్స్ చెల్లించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కల్గించారనేది ప్రధాన అభియోగంగా ఉందన్నారు.