Kidnap: కిరాణా వ్యాపారి కిడ్నాప్.. రూ. 10 లక్షల డిమాండ్
- జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన
- ఇవ్వాల్సిన రూ. లక్ష ఇస్తామని బాధితుడిని హైదరాబాద్ పిలిపించిన నిందితులు
- హైదరాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో బాధితుడిని బంధించిన కిడ్నాపర్లు
- ఆయన భార్యకు ఫోన్ చేసి రూ. 10 లక్షల డిమాండ్
- రంగంలోకి దిగి బాధితుడిని రక్షించిన పోలీసులు
జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ కిరాణ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. వ్యాపారిని అపహరించిన దుండగులు విడిచిపెట్టేందుకు రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడిని రక్షించారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన రమేశ్‌బాబుకు ఓ వ్యక్తి లక్ష రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో సోమవారం ఓ వ్యక్తి రమేశ్‌బాబుకు ఫోన్ చేసి హైదరాబాద్ వచ్చి డబ్బులు తీసుకోవాలని కోరాడు. దీంతో ఆయన వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు.
అక్కడ ఇద్దరు వ్యక్తులు రమేశ్‌ను కలిసి ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి బంధించి హింసించారు. అనంతరం ఆయన భార్యకు ఫోన్ చేసి రమేశ్‌ను కిడ్నాప్ చేశామని, విడిచిపెట్టాలంటే రూ. 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు రమేశ్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నట్టు గుర్తించి అక్కడికి వెళ్లి రక్షించారు. అనంతరం గద్వాల తీసుకొచ్చారు. కిడ్నాపర్లలో శాంతినగర్‌కు చెందిన ఓ మొబైల్ షాప్ యజమాని, కల్కుంట గ్రామానికి చెందిన వ్యక్తితోపాటు హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నేడు వెల్లడించనున్నట్టు పోలీసులు తెలిపారు.