ISRO: ఇస్రో చైర్మన్‌గా నారాయణన్.. 14న బాధ్యతల స్వీకరణ

V Narayanan Appointed New ISRO Chief

  • సోమవారంతో ముగిసిన సోమనాథ్ పదవీ కాలం
  • రెండేళ్లపాటు సేవలు అందించనున్న వి.నారాయణన్
  • భారత్ సొంత క్రయోజనిక్ ఇంజిన్ అభివృద్ధిలో కీలక పాత్ర
  • స్వయం కృషితో ఇస్రోలో టాప్ ప్లేస్‌కి చేరిన నారాయణన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన చైర్మన్‌గా వి. నారాయణన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత చైర్మన్ ఎస్.సోమనాథ్ పదవీ కాలం సోమవారంతో ముగిసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14న నారాయణన్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. 

నారాయణన్ ప్రస్తుతం ఇస్రోలో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్‌పీఎస్‌సీ) డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి వంటి కీలక ప్రయోగాలకు ఆయన విశేషమైన మార్గదర్శకత్వం అందించారు. ఇతర దేశాలు భారత్‌కు ఈ సాంకేతికతను  అందించడాన్ని నిరాకరించిన సందర్భాల్లో, స్వదేశీ పరిజ్ఞానంతో దానిని విజయవంతంగా అభివృద్ధి చేశారు.

ఇస్రో చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా నారాయణన్ మాట్లాడుతూ, "భారత అంతరిక్ష పరిశోధనకు ఒక స్పష్టమైన దిశ ఉంది. ఇస్రోను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు మా శాస్త్రవేత్తల ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకుంటాను" అని చెప్పారు.

స్వయం కృషితో అత్యున్నత స్థాయికి

వి. నారాయణన్  స్వయంకృషితో ఇస్రోలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. 1984లో ఇస్రోలో చేరిన ఆయన, రాకెట్ ప్రొపల్షన్, అంతరిక్ష నౌకల రంగంలో విశేషమైన నైపుణ్యాన్ని చూపారు. 2018లో ఎల్‌పీఎస్‌సీ డైరెక్టర్‌గా నియమితులైన తరువాత, ద్రవ, సెమీ-క్రయోజెనిక్, క్రయోజెనిక్ ఇంధన వ్యవస్థల అభివృద్ధిలో కీలకమైన మార్పులు తీసుకొచ్చారు. ఇవి భారత అంతరిక్ష ప్రయోగాలకు మరింత ఊతాన్ని ఇచ్చాయి. గగన్‌యాన్ మిషన్ కోసం నారాయణన్ మానవ రహిత సర్టిఫికేషన్ బోర్డ్ చైర్మన్‌గా పనిచేస్తూ, భారత తొలి మానవ అంతరిక్ష ప్రయోగానికి పునాది వేశారు.

నారాయణన్ విద్యా ప్రస్థానంలో కూడా విశేషమైన ప్రతిభను ప్రదర్శించారు. తమిళ  మాధ్యమ పాఠశాలలో చదివిన ఆయన, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో క్రయోజెనిక్ ఇంజినీరింగ్‌లో ఎం.టెక్ పూర్తి చేశారు. ప్రథమ ర్యాంకు సాధించి సిల్వర్ మెడల్ పొందారు.

ప్రస్తుత చైర్మన్ ఎస్. సోమనాథ్ నేతృత్వంలో చంద్రయాన్-3 విజయంతో అంతరిక్ష పరిశోధనలో భారత్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్‌ను దించి, ప్రపంచంలోనే ఆ ఘనత సాధించిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. వి. నారాయణన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తమ ప్రగతిని మరింత వేగవంతం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News