Team Pakistan: దక్షిణాఫ్రికాపై దారుణంగా ఓడిన పాకిస్థాన్ జట్టుకు మరో షాక్

Pakistan was fined for slow over rate against South Africa

  • స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా
  • ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఐదు పాయింట్ల కోత
  • జరిమానాకు అంగీకరించిన పాక్ కెప్టెన్ షాన్ మసూద్

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఓటమి పాలైన పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేటుకు భారీ మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ ఫీజులో భారీ కోతతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లోనూ కొన్ని పాయింట్లు కోల్పోయింది.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక్కో స్లో ఓవర్‌కు మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధిస్తారు. మ్యాచ్ పూర్తయ్యే సమయానికి పాక్ జట్టు ఐదు ఓవర్లు తక్కువగా వేసినట్టు తేలడంతో జట్టు సభ్యులందరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ రిఫరీ రిచర్డ్‌సన్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ)లో 5 పాయింట్లు కోల్పోయింది. జరిమానాను పాక్ కెప్టెన్ షాన్ మసూద్ అంగీకరించినట్టు ఐసీసీ తెలిపింది.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది. కాబట్టి పాయింట్ల కోతతో ఆ జట్టుకు పెద్దగా నష్టమేమీ ఉండదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా 1-3తో కోల్పోవడంతో ఆస్ట్రేలియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. జూన్‌లో ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌లో జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్లు తలపడతాయి.

  • Loading...

More Telugu News