Jayam Ravi: శివకార్తికేయన్ సినిమాలో విలన్ గా జయం రవి
- ముఖ్య పాత్రల్లో శ్రీలీల, అథర్వా
- పీరియడ్ డ్రామాగా భారీ స్థాయిలో నిర్మాణం
- జి.వి. ప్రకాశ్ సంగీతం, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ
- కాలేజీ రోజుల్లో జయం రవి సినిమాలంటే అభిమానమని చెప్పిన శివకార్తికేయన్
జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లో శివకార్తికేయన్ హీరోగా నటిస్తుండగా, ఈ సినిమాలో విలన్ పాత్రలో జయం రవి నటిస్తున్నారు.
జయం రవి ఈ పాత్రకు ‘ఓకే’ చెప్పినప్పుడు తాను ఎంతగానో సంతోషించానని శివకార్తికేయన్ చెప్పారు.
ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో శివకార్తికేయన్ మాట్లాడుతూ, "మేం ఈ సినిమాకి షూటింగ్ ప్రారంభించాం. రెండు రోజుల క్రితం ప్రోమో షూట్ జరిగింది. ఇంకా షూటింగ్ కొనసాగుతోంది. ఇది పెద్ద స్థాయిలో తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా. ఇది మరింత భారీ స్థాయిలో ఉంటుంది" అని వివరించారు.
ఈ సందర్భంగా శివకార్తికేయన్ ఇతర నటీనటుల వివరాలను కూడా పంచుకున్నారు. "ఈ సినిమాలో శ్రీలీల, అథర్వా నటిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. రవి కె. చంద్రన్ గారు సినిమాటోగ్రఫీ చేస్తున్నారు" అని తెలిపారు.
"ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం జయం రవి సర్ విలన్ పాత్ర చేయడం. ఇది చాలా బలమైన పాత్ర. ఆయన ‘యస్... ఈ సినిమా చేస్తున్నాను' అని చెప్పినప్పుడు నాకు ఎంతగానో సంతోషంగా అనిపించింది. ఎందుకంటే, నేను కాలేజీలో ఉన్నప్పుడే ఆయన సినిమాలు చూడడం ప్రారంభించాను. నా కాలేజ్ డేస్ సమయంలో ఆయన సినిమా రంగంలోకి ప్రవేశించారు. చిత్ర పరిశ్రమలో ఆయన నాకు సీనియర్. ఆయన సినిమాలను ఎంతో ఆస్వాదించాను. ఇప్పుడు ఆయనతో కలిసి నటించడం, ఒకరిపై ఒకరు పోరాడే సన్నివేశాల్లో నటించడం చాలా ఉత్సాహంగా ఉంది" అని శివకార్తికేయన్ తెలిపారు.
దర్శకురాలు సుధా కొంగర పనితీరును గురించి మాట్లాడుతూ, "సుధా మేడమ్ చాలా శ్రద్ధగా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అందుకే ఏ ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉండదు. ఆమె ఎప్పుడూ ఎనర్జీతో ఉంటారు" అని అన్నారు.
తాను షూటింగ్ పునఃప్రారంభం కోసం ఎదురు చూస్తున్నానని ఆయన చెప్పారు. "మేము అనేక ప్రదేశాల్లో షూటింగ్ చేస్తున్నాం. సరిగ్గా చెప్పాలంటే ఇది మా టీమ్‌కి ఒక కష్టమైన ప్రాజెక్ట్" అని తెలిపారు.
ఇతర ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, "ఏఆర్ మురుగదాస్ గారితో చేస్తున్న నా సినిమా 90 శాతం పూర్తయ్యింది. మిగిలిన 10 శాతం, సల్మాన్ ఖాన్ తో తీస్తున్న సినిమా షూటింగ్ ముగించుకుని మురుగదాస్ గారు తిరిగి వచ్చిన తరువాత పూర్తి చేస్తాం" అని శివకార్తికేయన్ తెలిపారు.