Chandrababu: మరో పార్టీ సింబల్ తెలియని నియోజకవర్గం నాది: సీఎం చంద్రబాబు

CM Chandrababu said no place for other party in his Kuppam constituency

  • కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన
  • స్వర్ణ కుప్పం కార్యక్రమంలో ప్రసంగం
  • తనపై మూడు బాధ్యతలు ఉన్నాయని వెల్లడి
  • టీడీపీ కార్యకర్తలను ఎంటర్ ప్రెన్యూర్లుగా తయారుచేస్తామని వ్యాఖ్యలు

గత ఐదేళ్లలో ధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెడుతున్నానని, ఓట్లేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలందరికీ సుపరిపాలన అందించడమే లక్ష్యంగా జన నాయకుడు పోర్టల్ ను రూపొందించామని, మొదట కుప్పంలో దీన్ని అమలు చేసి, ఆపై రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన నేడు రెండో రోజు కూడా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేనని అన్నారు. తనను 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, ఈ నియోజకవర్గ ప్రజలకు సైకిల్ గుర్తు తప్ప మరో పార్టీ సింబల్ తెలియదని, తనపై మొదటి నుంచి నమ్మకం చూపిస్తున్నారని అన్నారు.  మారుమూల ప్రాంతమైన కుప్పం నియోజకవర్గంలో మరో పార్టీ జెండా ఎగరలేదని వెల్లడించారు.

రాబోయే ఐదేళ్లలో కుప్పాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా స్వర్ణ కుప్పం విజన్ -2029కి రూపకల్పన చేశామని, ఇప్పుడు కుప్పం ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి న్యాయం చేయడం కోసం  జన నాయకుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చంద్రబాబు వివరించారు. 

నాపై మూడు బాధ్యతలున్నాయి

నేను పార్టీ అధ్యక్షుడిని. కుప్పం ఎమ్మెల్యేని. రాష్ట్ర ముఖ్యమంత్రిని. నాపై మూడు రకాల బాధ్యతలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో టీడీపీ కార్యకర్తలు మేమిచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లేయించారు. పార్టీ అధ్యక్షుడిగా ఆ హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. అలాగే కుప్పం ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల బాగోగులు నేను చూసుకోవాలి. 

స్థానికులు వారి సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చేందుకు వీలుగా  జన నాయకుడు పోర్టల్ తీసుకొచ్చాం. ఇక్కడ నా పీఏ, కడా అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. నేను ఎమ్మెల్యేగా చేయాల్సిన బాధ్యతలను వారు నాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు. తద్వారా బాధితుల సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాను. 

ఇక ప్రభుత్వ సమస్యలన్నీ PGRSకు వెళతాయి. గ్రీవెన్స్ , భూ సమస్యలు, సీఎంఆర్ఎఫ్ వంటివి ప్రభుత్వం చూస్తుంది. 

టీడీపీ కార్యకర్తలను ఎంటర్ ప్రెన్యూర్లుగా తయారుచేస్తాం

పార్టీని తమ భుజాలపై మోస్తున్న కార్యకర్తలను ఎంటర్ ప్రెన్యూర్లు గా తయారుచేస్తాం. టీడీపీ సభ్యత్వాలు కోటికి చేరువగా రావడం సంతోషాన్నిస్తోంది. టీడీపీకి కార్యకర్తలే బలం. కష్ట సమయంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యర్తలను కుటుంబసభ్యుల్లా చూసుకుంటున్నాము. ప్రతి కార్యకర్తకు రూ. 5 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నాము. వారి పిల్లల చదువులు, ఉద్యోగ, ఉపాధికి ఆర్థిక చేయూత అందిస్తున్నాము. పార్టీకి సేవ చేసిన వారందరికీ న్యాయం చేస్తాము. పార్టీ కార్యకర్తలకు ఆమోదయోగ్యమైన వారికే పదవులు ఇస్తాము. 

వ్యవస్థలను నాశనం చేసి పోయారు

గత పాలకులు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు. అప్పులకుప్పగా రాష్ట్రాన్ని మార్చేశారు. అరాచక పాలనను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధించారు. జైలు పాల్జేశారు. చివరకు మీడియా ప్రతినిధులపైనా కేసులు పెట్టారు. ఒక ఆర్డర్ తెచ్చి మీడియాపై కేసులు ఎత్తేస్తాం. భూములకు సంబంధించిన ఫైళ్లన్నీ తారుమారు చేసిన ఘనులు వైసీపీ నేతలు. భూములను కబ్జా చేసేశారు. రెవెన్యూ సదస్సుల్లో ఆ దస్త్రాలన్నింటినీ సరిదిద్దుతున్నాం. 

యువతకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు తీసుకొస్తున్నాం. రాష్ట్రంలో కరవును పారద్రోలి, నీటి భద్రత కల్పించేందుకు గోదావరి పెన్నా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాము. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొస్తాను. ఆపై కుప్పానికీ నీరు అందిస్తాను. అలాగే హంద్రినీవా పనులను జూన్ కల్లా పూర్తి చేసి కృష్ణా జలాలను కుప్పానికి తీసుకొస్తాను" అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News