Chandrababu: అప్పుడందరూ వెతుక్కుంటూ కుప్పం వస్తారు: సీఎం చంద్రబాబు
- కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన
- వివిధ నిర్మాణాలకు శంకుస్థాపన
- అనంతరం 'స్వర్ణ కుప్పం' సభకు హాజరు
- కుప్పం వచ్చే ప్రజల ఆయుష్షు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు
- 2047 నాటికి కుప్పంను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం చేస్తామని వెల్లడి
సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన నేడు రెండో రోజు కూడా కొనసాగింది. కుప్పంలో పలు నిర్మాణ పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. మదర్ డెయిరీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణాల భూమిపూజలో పాల్గొన్నారు. కడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. వివిధ కంపెనీల ప్రతినిధులతోనూ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
అనంతరం ఏర్పాటు చేసిన 'స్వర్ణ కుప్పం' సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ... రానున్న 23 ఏళ్లలో కుప్పం భారతదేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంలా ఉండాలని అన్నారు. ఎవరన్నా చదువుకోవాలంటే బెంగళూరుకు వెళ్లడం కాదు, కుప్పానికి రావాలి... అలాంటి విద్యాసంస్థలను ఇక్కడికి తీసుకువస్తామని వివరించారు.
ఇవన్నీ కాకుండా, అత్యంత నివాసయోగ్యమైన ప్రదేశంగా కుప్పంను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కుప్పానికి వచ్చే ప్రజలకు ఆరోగ్యం పెరగాలి... సాధారణంగా బెంగళూరు కంటే కుప్పం వచ్చే వాళ్లకు 20-30 ఏళ్లు ఎక్కువగా ఆయుష్షు పెరిగే పరిస్థితి వస్తే... అప్పుడందరూ వెతుక్కుంటూ కుప్పానికి వస్తారు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంత పరిశుభ్రమైన ప్రాంతంగా కుప్పంను తయారు చేస్తాం అని స్పష్టం చేశారు. అందుకు మీ అందరి సహకారం అవసరం అని అన్నారు. అంతేగాకుండా, కుప్పంను ఒక టూరిస్ట్ హబ్ గా మార్చుతామని, వీకెండ్ లో బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చేలా చేస్తామని చెప్పారు.
ఇక, నిడమూరులో ఇళ్లపై సోలార్ కరెంటు ఉత్పత్తికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం బాగా విస్తరించాల్సిన అవసరం ఉందని, ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు మంచి ధర వస్తుందని అన్నారు.
మైక్రో కిరాణా దుకాణాల యజమానులకు లాభాలు రావాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. టాటా సంస్థ సహకారంతో అందరికీ అధునాతన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.