Learning: అద్భుతంగా నేర్చుకునేందుకు... హార్వర్డ్​ వర్సిటీ టెక్నిక్స్​ ఇవే!

harvard suggests these 5 active learning techniques for everyone

  • ప్రపంచంలో ఎప్పటికప్పుడు వెలుగులోకి కొత్త అంశాలు...
  • నిరంతరం మారిపోతూనే ఉన్న టెక్నాలజీలు
  • చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా నేర్చుకోవాల్సిన అవసరం
  • సులువుగా నేర్చుకునేందుకు ఐదు టెక్నిక్స్ ఉన్నాయంటున్న హార్వర్డ్ నిపుణులు

చదువుకునే వారి నుంచి ఉద్యోగం చేసే వారిదాకా... అందరికీ ఎప్పుడూ కొత్త అంశాలు నేర్చుకోవడం తప్పనిసరి. చదువులో ముందుండాలన్నా, ఉద్యోగంలో, కెరీర్ లో పైకి ఎదగాలన్నా... నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలన్నది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఐదు రకాల యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ తో ఏదైనా సులువుగా, అద్భుతంగా నేర్చుకోగలమని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లలు, విద్యార్థుల నుంచి పెద్ద వయసు వారిదాకా ఎవరైనా ఈ టెక్నిక్స్ పాటిస్తే ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత సంస్థ నుంచి...
ప్రపంచంలోని అత్యంత ప్రముఖ విద్యా సంస్థల్లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఒకటి. 1636 అక్టోబర్ లో స్థాపించిన ఈ వర్సిటీకి సంబంధించి ప్రస్తుతం 19 వేల మందికిపైగా ఫ్యాకల్టీ, ఇతర సిబ్బంది, నాలుగు లక్షల మందికిపైగా పూర్వ విద్యార్థులు ఉన్నారంటేనే... దాని గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాంటి హార్వర్డ్ నిపుణులు చెబుతున్న ‘యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్’ ఇవిగో...

తరచూ మననం చేసుకోవడం...
మనం నేర్చుకునే ఏ అంశాన్ని అయినా కచ్చితంగా ఒక నిర్ణీత సమయం పెట్టుకుని గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎంత వరకు గుర్తుంది, ఏమేం మర్చిపోతున్నామనేది గమనించాలి. దీనివల్ల ఆయా అంశాలకు సంబంధించిన జ్ఞాపకాలు మన మెదడులో లోతుగా అల్లుకుపోతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మీకు మీరే టెస్టు పెట్టుకోవడం...
ఏదైనా అంశానికి సంబంధించి నిర్ణీత పాయింట్లపై మీకు మీరే చిన్న చిన్న పరీక్షలు పెట్టుకోవాలి. మామూలుగా ఎవరైనా ఫ్యాకల్టీ ప్రశ్నాపత్రం తయారు చేస్తే ఎలా ఉంటుంది? ఏ ప్రశ్నలు, ఎలా వేస్తారనే ఆలోచన చేసి... అందుకు తగినట్టుగా టెస్టును రూపొందించుకుని దానికి విభిన్నంగా, ప్రాక్టికల్ గా సమాధానాలను ప్రాక్టీస్ చేయాలి.

ఇతరులకు నేర్పించండి/బోధించండి
మనం నేర్చుకుంటున్న అంశాలను అదే సమయంలో మరొకరికి నేర్పించడం లేదా బోధించడాన్ని ప్రాక్టీస్ చేయాలి. తోటివారికైనా, స్నేహితులకైనా ఆ అంశం అర్థం అయ్యేలా బోధించేందుకు ప్రయత్నించాలి. ఈ క్రమంలో ఆ అంశాన్ని మరింత సులువుగా గుర్తుంచుకునే టెక్నిక్ మీ మెదడులోనే ఉత్పన్నం అవుతుంది. దీర్ఘకాలిక మెమరీగా స్టోర్ అవుతుంది.

చెబుతున్నది విని వేగంగా నోట్ చేసుకోవాలి...
ఎవరైనా ఏదైనా అంశాన్ని చెబుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు పూర్తి ఏకాగ్రతతో వింటూ, వెంట వెంటనే వేగంగా నోట్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. తిరిగి మీరు నోట్స్ ను చూసుకుంటే... సంబంధిత అంశం, బోధించిన తీరు వెంటనే జ్ఞప్తికి రావాలి. ఇది మీలో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని హార్వర్డ్ నిపుణులు చెబుతున్నారు.

నేర్చుకున్న దానిపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి
మీరు నేర్చుకున్న కొత్త అంశంగానీ, సాంకేతికతను గానీ బయట అప్లై చేయడానికి ప్రయత్నించాలి. ఇతరులకు వివరించి వారి అభిప్రాయం తీసుకోవాలి. ఇంతకన్నా సులువుగా, భిన్నంగా చేయడం ఎలాగనే సూచనలు స్వీకరించాలి. ఈ అభిప్రాయాలు, సూచనలకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


  • Loading...

More Telugu News