New Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్నికల సంఘం
- జనవరి 10న నోటిఫికేషన్ విడుదల
- ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
- ఫిబ్రవరి 8న ఫలితాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుందని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు.
ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 10న విడుదల అవుతుంది. నామినేషన్ల సమర్పణకు జనవరి 17 చివరి తేదీ. నామినేషన్ల పరిశీలన జనవరి 18న ప్రారంభం కానుంది. జనవరి 20 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.
ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2.08 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.