KTR: కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ
- ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ కు నోటీసులు
- ఈ నెల 16న విచారణకు రావాలంటూ నోటీసులు
- వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలన్న ఈడీ
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు రావాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.
వాస్తవానికి ఈరోజు (జనవరి 7) విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్ కు ఈడీ ఇటీవల నోటీసులు పంపింది. అయితే తెలంగాణ హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో... విచారణకు హాజరు కావడానికి తనకు సమయం ఇవ్వాలని ఈడీని కేటీఆర్ కోరారు. కేటీఆర్ విన్నపం పట్ల స్పందించిన ఈడీ అధికారులు... విచారణకు మరో తేదీని ప్రకటిస్తామని చెప్పారు.
మరోవైపు, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఏసీబీ, ఈడీలు స్పీడు పెంచాయి.