BJP Office: ప్రియాంకాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి
- ప్రియాంకాగాంధీపై బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు
- బీజేపీ కార్యాలయంపై రాళ్లు రువ్విన కాంగ్రెస్ శ్రేణులు
- బీజేపీ దళితమోర్చా కార్యకర్త తలకు గాయం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేశ్ బిదూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఢిల్లీ రోడ్లను ప్రియాంకాగాంధీ బుగ్గల్లా మారుస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. రమేశ్ బిదూరి ఫొటోను చెప్పులతో కొడుతూ హంగామా చేశారు. రమేశ్ బిదూరి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ కార్యాలయం లోపల నుంచి వచ్చిన ఆ పార్టీ కార్యకర్తలు కర్రలతో దాడి చేయగా... బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో బీజేపీ దళితమోర్చా కార్యకర్త తలకు గాయమయింది. ఈ క్రమంలో అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.