Drunk Driving: క్రియేటివ్ పోలీసింగ్.. తాగి బండి నడుపుతున్న తండ్రికి కొడుకుతో కౌన్సెలింగ్.. వీడియో ఇదిగో!
- ఇక జన్మలో మద్యం సేవించి డ్రైవింగ్ చేయనంటూ కన్నీళ్లతో కొడుకుకు ప్రామిస్ చేసిన తండ్రి
- తెలంగాణలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
డ్రంకెన్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డ ఓ తండ్రికి ట్రాఫిక్ పోలీసులు ఆయన చిన్నారి కొడుకుతో కౌన్సెలింగ్ చేశారు.. ‘నాన్నా నాకు నువ్వు కావాలి, డ్రింక్ చేసి బండి నడపొద్దు నాన్నా’ అంటూ తండ్రికి చెప్పించారు. తన కొడుకు నోటి వెంట ఈ మాటలు విన్న ఆ తండ్రి కన్నీళ్లు పెడుతూ ఇక జన్మలో మద్యం సేవించి బండి నడపను బిడ్డా అంటూ కొడుకును హత్తుకున్నాడు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను కదిలిస్తోంది. పలువురు నెటిజన్లు భావోద్వేగంతో కామెంట్లు పెడుతున్నారు. క్రియేటివ్ పోలీసింగ్ అంటూ మెచ్చుకుంటున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తండ్రికి కొడుకుతో కౌన్సిలింగ్ ఇప్పించిన ఉప్పల్ ఎస్ హెచ్ ఓ లక్ష్మీ మాధవిని అభినందించింది.
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. బండి మీద భార్యాపిల్లలతో వెళుతున్న అతడిని ఆపి టెస్ట్ చేయగా.. మద్యం సేవించినట్టు తేలింది. మద్యం సేవించి బండి నడపడం ప్రాణాంతకమని తెలిసి కూడా తన ప్రాణాలను రిస్క్ చేయడమే కాకుండా భార్యాపిల్లల ప్రాణాలనూ రిస్క్ లో పెడుతున్నారంటూ ఆ వ్యక్తికి ఎస్ హెచ్ ఓ లక్ష్మీ మాధవి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇదంతా తాను చెప్పకుండా ఆయన కొడుకుతోనే చెప్పించారు. దీంతో ఆ తండ్రి భావోద్వేగానికి గురై ఏడ్చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎస్ హెచ్ ఓ లక్ష్మీ మాధవికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.