Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు బెయిల్ నిరాకరణ

Supreme Court Dismissed YCP EX MP Nandigam Suresh Bail Plea

  • మరియమ్మ హత్య కేసులో జైలుపాలైన మాజీ ఎంపీ 
  • బెయిల్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • ట్రయల్ కోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోబోమన్న సుప్రీం బెంచ్

మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్ కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. సురేశ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ మంగళవారం తీర్పు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మరియమ్మ హత్య కేసులో పోలీసులు నందిగం సురేశ్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బెయిల్ కోసం నందిగం సురేశ్ ట్రయల్ కోర్టును ఆశ్రయించగా.. ఆయన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. మాజీ ఎంపీ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తీర్పు చెబుతూ.. తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను దాచారనే కారణంతో ట్రయల్ కోర్టు నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిందని గుర్తుచేసింది. దీంతో ట్రయల్ కోర్టు ఆదేశాలలో తాము కల్పించుకోబోమని పేర్కొంటూ మాజీ ఎంపీ బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. 

మరియమ్మ హత్య కేసు..
తుళ్లూరు మండలం వెలగపూడికి చెందిన ఎస్సీ మహిళ మరియమ్మ 2020లో హత్యకు గురైంది. అప్పట్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ తమను మోసం చేశారని మరియమ్మ బహిరంగంగా దూషించింది. తనకు పెన్షన్ ఆపేశారని, ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడింది. దీంతో నందిగం సురేశ్ అనుచరులు మరియమ్మ ఇంటిపై దాడి చేశారు. మరియమ్మను తీవ్రంగా కొట్టి చంపేశారు. ఫిర్యాదు చేసినా అప్పట్లో పోలీసులు పట్టించుకోలేదని, కేసును పక్కన పెట్టారని మరియమ్మ కుమారుడు ఆరోపించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి నారా లోకేశ్ ను కలిసి న్యాయం చేయాలంటూ మరియమ్మ కుమారుడు విజ్ఞప్తి చేశాడు. మంత్రి లోకేశ్ ఆదేశాలతో కేసు దర్యాఫ్తులో వేగం పెంచిన పోలీసులు.. మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

  • Loading...

More Telugu News