Pakistan: 123 ఏళ్ల నాటి రికార్డును బద్దలుగొట్టిన పాకిస్థాన్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా అవతరణ!
- ఫాలోఆన్‌లో ఏకంగా 478 పరుగులు చేసిన పాక్
- సౌతాఫ్రికా గడ్డపై ఇదే అత్యధికం
- తొలి వికెట్‌కు 205 పరుగులు జోడించిన మసూద్-బాబర్ జోడీ
- ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి వికెట్‌కే ఇదే అత్యధిక భాగస్వామ్యం
- వరుసగా రెండు టెస్టుల్లోనూ ఓడి సిరీస్ కోల్పోయిన పాక్
పాకిస్థాన్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 123 ఏళ్ల రికార్డును తుడిచిపెట్టేసింది. దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్టులోనూ దారుణ పరాభవం మూటగట్టుకున్నప్పటికీ శతాబ్దానికిపైగా పదిలంగా ఉన్న రికార్డును బద్దలుగొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకే కుప్పకూలి ఫాలో ఆన్ ఆడిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకుని 478 పరుగులు చేసింది. అయినప్పటికీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.
కెప్టెన్ మసూద్-మాజీ కెప్టెన్ బాబర్ ఆజం జోడీ తొలి వికెట్‌కు ఏకంగా 205 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. 81 పరుగులు చేసిన బాబర్ అవుట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. మసూద్ 145 పరుగులు చేసి అవుటయ్యాడు.
ఈ క్రమంలో 123 ఏళ్ల నాటి మరో రికార్డు బద్దలైంది. సౌతాఫ్రికా గడ్డపై ఫాలోఆన్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా పాక్ రికార్డులకెక్కింది. షాన్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికా గడ్డపై తొలిసారి ఫాలోఆన్‌లో 400 పరుగులు చేసిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ఇప్పుడా రికార్డును పాకిస్థాన్ బద్దలుగొట్టింది.
కాగా, ఫాలోఆన్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారత జట్టుతో కలిసి మరో రికార్డును కూడా పాక్ పంచుకుంది. 1958 బార్బడోస్‌లో వెస్టిండీస్‌పై పాకిస్థాన్ 657 పరుగులు చేయగా, 2001లో కోల్‌కతాలో ఆస్ట్రేలియాపై భారత జట్టు 657 పరుగులు సాధించాయి. ఇక, సౌతాఫ్రికా గడ్డపై ఫాలోఆన్‌లో పాక్ సాధించిన 478 పరుగులు రెండో అత్యధిక స్కోరు కాగా, 1999లో డర్బన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఫాలోఆన్‌లో 572 పరుగులు చేసింది. కాగా, సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులోనూ విజయం సాధించిన సఫారీ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.