Goutham: ఓటీటీకి వస్తున్న రెండు తెలుగు సినిమాలివే!
- గౌతమ్ హీరోగా రూపొందిన 'బ్రేక్ అవుట్'
- డిఫరెంట్ కంటెంట్ తో కూడిన సినిమా
- ఈ నెల 9వ తేదీ నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్
- అదే రోజున 'ఆహా'లో 'నీలిమేఘశ్యామ'
- నేరుగా ఓటీటీకి వస్తున్న రొమాంటిక్ కామెడీ
ఓటీటీలో ఈ వారం రెండు తెలుగు సినిమాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. ఒకటి 'బ్రేక్ అవుట్' అయితే, మరొకటి 'నీలి మేఘశ్యామ'. 'బ్రేక్ అవుట్' విషయానికి వస్తే, సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా రూపొందింది. బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీ నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమాలో కథానాయకుడికి 'మోనో ఫోబియా' .. ఒంటరిగా ఉండటానికి భయపడుతూ ఉంటాడు. అలాంటి అతను ఒకానొక సమయంలో ఒక గ్యారేజ్ లో ఒక్కడే చిక్కుబడిపోతాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? అక్కడి నుంచి ఎలా బయటపడతాడు? అనేది కథ. 'బసంతి' .. 'మను' వంటి విభిన్నమైన కథ చిత్రాల తరువాత గౌతమ్ చేసిన సినిమా ఇది. నటన పరంగా ఆయనకి ఈ పాత్ర ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టేది మాదిరిగానే ఉంది మరి.
ఇక విశ్వదేవ్ హీరోగా చేసిన 'నీలిమేఘశ్యామ' నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 9వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. రవివర్మ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీలో కథానాయికగా పాయల్ రాధాకృష్ణ అలరించనుంది. అర్జున్ - కార్తీక్ కథను అందించిన ఈ సినిమా, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా ఉంటుందని అంటున్నారు. శరణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.