Dil Raju: సినిమాలపై ఇష్టం అలా ఏర్పడింది: దిల్ రాజు
- నిజామాబాద్‌లో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్
- ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు
- ఇక్కడ 1980 దశకంలో రూపాయి చారానా టికెట్‌తో సినిమాలు చూసేవాళ్లమన్న దిల్ రాజు
- అదే చోట తమ 58వ సినిమా ఈవెంట్స్ చేయడం చాలా గర్వంగా ఉందని వ్యాఖ్య
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సినిమాలపై తనకు ఇష్టం ఎలా ఏర్పడిందో వివరించారు. 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ ట్రైలర్ ఈవెంట్‌ను సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్‌లో వేడుకగా నిర్వహించారు. ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంచ్ చేశారు. ఈ వేదికపై హీరో వెంకటేశ్ డ్యాన్స్‌తో సందడి చేసి అభిమానులను ఉత్తేజపర్చారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో తన చిన్న నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
"నిజామాబాద్ అంటే చిన్ననాటికి వెళ్లిపోవాలి. 1980 దశకంలో ఇక్కడ పిక్చర్ ప్యాలెస్, విజయ్ థియేటర్, లలితా మహాల్, రాజరాజేంద్ర థియేటర్, నటరాజ్ థియేటర్లలో రూపాయి చారనా టికెట్‌లో సైకిల్ మీద వెళ్లి నేను, శిరిశ్ సినిమాలు చూసే వాళ్లం. అలా సినిమాలపై ఇష్టం ఏర్పడింది. సినిమా ఫీల్డ్‌కు వస్తామని కూడా తెలియదు కానీ సినిమాలపై ఇష్టంతో వచ్చిన ప్రతి సినిమా చూసేవాళ్లం" అన్నారు.
నాడు అయిదు రూపాయలు తీసుకువస్తే ఇద్దరం సినిమా చూసి మధ్యలో పాప్ కార్న్ కొనుక్కొని తిని వెళ్లేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. అలా సినిమాలు చూస్తూ ఎదుగుతూ అదే నిజామాబాద్‌లో తమ 58వ సినిమా ఈవెంట్స్ చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. చాలా మంది దర్శకులు, ఎంతో మంది హీరోలు ఎంతో సపోర్టు చేయడం వల్లే తాము ఈ రోజు ఈ పొజిషన్‌లో ఉన్నామన్నారు.