bank robbery attempt: బ్యాంకు దోపిడీకి యత్నించి దొరికిపోయిన భార్యాభర్తలు

bank robbery attempt foiled in amarachinta

  • తాను మోసపోయిన విధంగా మరో ముగ్గురిని మోసం చేసిన అంకిత  
  • మోసం చేసిన వ్యక్తులకు డబ్బులు చెల్లించేందుకు బ్యాంకు దోపిడీ ప్లాన్ 
  • ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు దొరికిపోయిన భార్యాభర్తలు

బ్యాంకు దోపిడీకి విఫలయత్నం చేసిన భార్యాభర్తలు, వారికి సహకరించిన మరో ముగ్గురిని వనపర్తి జిల్లా అమరచింత పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి బ్యాంకులో చోరీ చేసిన డిజిటల్ వీడియో రికార్డర్, హ్యూండాయ్ క్రెటా కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 
 
గత నెల 30వ తేదీ అమరచింత యూనియన్ బ్యాంకు మేనేజర్, సిబ్బంది బ్యాంకు తెరిచిన సమయంలో స్ట్రాంగ్ రూమ్ హ్యాండిల్ విరిగిపోయి ఉండటం, బాత్ రూమ్ పక్క కిటికీ అద్దాలు పగిలిపోయి ఉండటం, సీసీ టీవీ కెమెరాల డీవీఆర్ వైర్లు కత్తిరించి ఉండటం, కిటికీల ఐరన్ గ్రిల్స్ ఊడిపోయి ఉండటంతో బ్యాంకులో దొంగలు పడినట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన బ్యాంకు మేనేజర్ స్ట్రాంగ్ రూమ్ తెరిచి పరిశీలన చేయగా, నగదు, నగలు, ఇతర డాక్యుమెంట్లు అలాగే ఉన్నాయి. అయితే దొంగలు చోరీకి విఫలయత్నం చేసినట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీనిపై బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ నేరస్తులను పట్టుకునేందుకు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఆత్మకూరు సీఐ శివకుమార్, అమరచింత ఎస్ఐ సురేశ్, సీసీఎస్ విభాగ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. టెక్నాలజీ సాయంతో తనిఖీ చేశారు. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో అమరచింతలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, హ్యూండాయ్ క్రెటా కారులో వెళుతున్న అయిదుగురు నిందితులు పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించగా వారిని పట్టుకుని విచారించగా, నేరం అంగీకరించారు. నిందితుల నుంచి కారు, బ్యాంకు సీసీ కెమెరాల డీవీఆర్ లను స్వాధీనం చేసుకున్నారు. 
 
బ్యాంకు దోపిడీకి భార్య, భర్తల వ్యూహం ..! ఎందుకుంటే..?
ఈ కేసులో భార్యాభర్తలు బ్యాంకు దోపిడీకి ఎందుకు పథక రచన చేశారు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? అన్నవి ఒకసారి గమనిస్తే.. వనపర్తి మండలం మెంటేపల్లి గ్రామానికి చెందిన పసుపుల అంకిత బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా, సౌత్ సెంట్రల్ రైల్వేలో టికెట్ కౌంటర్ మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి రూ.5 లక్షలు తీసుకుని ఆమెను మోసం చేశాడు. దీంతో ఆమె ప్రైవేటు ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతంతో జల్సాలకు అలవాటు పడింది. జీతం సరిపోక ఎలాగైనా ఎక్కువ మొత్తం సంపాదించాలన్న ఆశతో తాను మోసపోయినట్లే ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదించాలని భావించింది. 

గద్వాలకు చెందిన ముగ్గురికి రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.6 లక్షల చొప్పున తీసుకుని ఆ డబ్బుతో గోవా, బెంగళూరు విహార యాత్రలకు వెళ్లి ఖర్చు చేసింది. 2022లో మెంటేపల్లి గ్రామానికి చెందిన జగదీశ్వరరెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే గద్వాలకు చెందిన వ్యక్తులు తాము మోసపోయామని గ్రహించి 2024 నవంబర్ నెలలో అంకితపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. దీంతో తాను మోసం చేసినట్లు అంకిత భర్త జగదీశ్వర్ రెడ్డి వద్ద అంగీకరించింది. దీంతో బాధితులకు డబ్బులు చెల్లించేందుకు ఆయన ఒప్పుకున్నాడు. అయితే, అంత డబ్బు చెల్లించాలంటే ఏదైనా బ్యాంకు దోపిడీ చేయాల్సిందేనని, అంతకు మించి వేరే మార్గం లేదని అంకిత భర్తకు సలహా ఇచ్చింది. 

బ్యాంకు దోపిడీ ఎలా చేయాలనే దానిపై అంకిత యూట్యూబ్‌లో వీడియోలు చూసి భర్తకు తెలిపింది. ఈ పథకాన్ని అమలు చేయడానికి వారి బంధువు రాచాల భాస్కరరెడ్డి, మెంటేపల్లికి చెందిన మంద నాగరాజు, కుడుకుంట్లకు చెందిన కడారి గణేశ్‌ల సాయం కోరి వారికి డబ్బు ఆశ చూపారు. ముందుగా వేసుకున్న వ్యూహం ప్రకారం అంకిత కారులో వెళ్లి గద్వాల, నారాయణపేట, మరికల్ ప్రాంతాల్లోని బ్యాంకులను పరిశీలించారు. అక్కడ బ్యాంకు దోపిడీ చేయడానికి అవకాశం లభించకపోవడంతో అమరచింత మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో దోపిడీకి ప్రయత్నించారు. లాకర్ తెరుచుకోకపోవడంతో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) ఎత్తుకెళ్లిపోయారు.   

  • Loading...

More Telugu News