Corona Virus: కోవిడ్‌లా హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందేది కాదు... మాస్కులు ధరించాలి: కర్ణాటక ప్రభుత్వం అడ్వైజరీ

Karnataka Govt Issues Dos and Donts amid HMPV Outbreak

  • హెచ్ఎంపీవీ పట్ల ఎవరూ భయపడవద్దన్న కర్ణాటక ప్రభుత్వం
  • రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచన
  • హెచ్ఎంపీవీ ప్రాథమికంగా పిల్లలపై ప్రభావం చూపుతుందని వెల్లడి
  • హెచ్ఎంపీవీ లక్షణాలు కలిగినవారు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచన

హెచ్ఎంపీవీ వైరస్ కోవిడ్-19లా వ్యాప్తి చెందేది కాదని, కాబట్టి ఎవరూ భయపడవద్దని కర్ణాటక ప్రభుత్వం సూచించింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ సోకడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అడ్వైజరీని విడుదల చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించింది.

ఇది శ్వాసకోశ సంబంధిత వైరస్ అని వెల్లడించింది. ఈ వైరస్ ప్రాథమికంగా పిల్లలపై ప్రభావం చూపుతుందని, వారిలో సాధారణ జలుబు వంటి ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుందని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అడ్వైజరీలో పేర్కొంది. ఇన్‌ఫ్లుయెంజాలాంటి అనారోగ్యం, తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ వంటి కేసులను రిపోర్ట్ చేయాలని ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది.

హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కూడా సూచనలు చేసింది. ఎవరైనా దగ్గినప్పుడు, తుమ్మిన సమయంలో నోరు, ముక్కును కప్పి ఉంచుకోవాలని, తరచూ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సూచించింది. హెచ్ఎంపీవీ లక్షణాలు కలిగిన వారు, రోగులకు సన్నిహితంగా ఉన్నవారు బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఉపయోగించిన టిష్యూ పేపర్లను మరలా వాడవద్దని, తవ్వాలు లేదా హ్యాండ్ కర్చీఫ్‌ను ఒకరికి మించి ఉపయోగించవద్దని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దని విజ్ఞప్తి చేసింది.

హెచ్ఎంపీవీ సోకితే దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఫ్లూలాంటి లక్షణాలు కనబడతాయని వెల్లడించింది. మరింత తీవ్రమైన కేసుల్లో అయితే ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి లేనివారిలో ఇది బ్రాంక్రైటిస్, నిమోనియాకు దారి తీసే అవకాశముందని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలిపింది. ప్రస్తుతానికి హెచ్ఎంపీవీకి నిర్దిష్టమైన యాంటీ వైరల్ చికిత్స, వ్యాక్సిన్ లేవని తెలిపింది. తగిన విశ్రాంతి తీసుకోవడం, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం వంటి చర్యలతో కాస్త ఉపశమనం ఉంటుందని తెలిపింది.

Corona Virus
Karnataka
  • Loading...

More Telugu News