Nara Lokesh: రఘురామ నివాసంలో కార్యకర్తలతో భేటీ అయిన నారా లోకేశ్
- ఉండి నియోజకవర్గంలో నారా లోకేశ్ పర్యటన
- రఘురామ నివాసంలో టీడీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం
- కార్యకర్తలకు అత్యంత విలువనిచ్చే పార్టీ టీడీపీయేనని స్పష్టీకరణ
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఉండి నియోజకవర్గ పర్యటనలో భాగంగా అమిరంలోని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నివాసాన్ని మంత్రి లోకేశ్ సోమవారం మధ్యాహ్నం సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన పార్టీ కార్యకర్తలతో లోకేశ్ మాట్లాడుతూ... నాయకుల పర్యటనల్లో ఎటువంటి హంగు, ఆర్భాటాలు వద్దని స్పష్టం చేశారు. అహంకారం , విచ్చలవిడితనం ప్రజలు అంగీకరించరని పేర్కొన్నారు.
"జగన్ హయంలో జరిగిన విధ్వంసం వలన రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగింది. నెలకి రూ.4 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రం నడుస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయిలు పెంచాం, దేశంలో అత్యధిక పెన్షన్ ఇస్తున్నది మనమే. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే అన్న క్యాంటీన్లు తెరిచాం, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం.ఇచ్చిన ప్రతి హామీ క్రమపద్ధతిలో అమలుకు కృషిచేస్తున్నాం. మనల్ని ప్రశ్నించే హక్కు జగన్ కు లేదు" అని స్పష్టం చేశారు.
టీడీపీలోనే కార్యకర్తలకు పెద్దపీట
కార్యకర్తలకు టీడీపీ ఇచ్చే ప్రాధాన్యత ఇతర ఏ పార్టీ ఇవ్వదు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ఈసారి కార్యకర్తలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా సాయం అందిస్తాం. కార్యకర్తల ఆరోగ్యం కోసం కూడా ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం. కార్యకర్తల పిల్లల ఉద్యోగాల కోసం కూడా పార్టీ కార్యాలయం ద్వారా సాయం అందించేలా ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం. గత ఐదేళ్లలో చట్టాన్ని అతిక్రమించి అరాచకాలు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం.
మరో నెల రోజుల్లో అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం. గత ఐదేళ్లు క్షేత్ర స్థాయిలో పని చేసిన వారికే ప్రాధాన్యతనిస్తాం. గ్రామ స్థాయి కార్యకర్త పోలిట్ బ్యూరో స్థాయికి తీసుకెళ్లేలా ఒక ఆలోచన చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దానిపై నిర్ణయం తీసుకుంటాం.
రెండు పర్యాయాలు ఒక పదవి చేసిన తరువాత పైకి అయినా వెళ్ళాలి లేదా ఉన్న పదవి నుంచి వైదొలగి ఒక టర్మ్ ఖాళీగా అయినా ఉండాలి. ఆ మేరకు పార్టీ నిర్ణయం తీసుకుంటే నేను , కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వచ్చే విడత పదవి తీసుకోకుండా సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా క్షేత్ర స్థాయిలో పనిచేసే వారు పోలిట్ బ్యూరో వరకూ వచ్చే అవకాశం ఉంటుంది. దీనిపై పార్టీలో నిరంతరం చర్చ జరగాలి. అప్పుడే పార్టీ పది కాలాలపాటు వర్థిల్లుతుంది.
శ్రీనివాసవర్మ గృహాన్ని సందర్శించిన లోకేశ్
రఘురామ నివాసం నుంచి భీమవరంలోని కేంద్ర సహాయమంత్రి శ్రీనివాసవర్మ గృహాన్ని మంత్రి లోకేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఇంటి దగ్గర మూడు పార్టీల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "రాష్ట్రంలో గత అరాచక పాలన అంతమొందించేందుకు అన్ కండిషనల్ గా ఎన్డీయే కి మద్దతు పలికాం. అందుకే రాష్ట్ర అభివృద్ధి కి కేంద్రం కూడా సహకరిస్తుంది. రాజమండ్రి సభలో ప్రధాని ఎన్ని సీట్లు గెలుస్తాం అని అడిగితే 22 ఎంపీ సీట్లు గెలుస్తాం అని చెప్పాను, 21 సీట్లు గెలిచాం.
నాటి సైకో పాలనలో మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు నాయకులు నలిగిపోయారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. దేశ సమగ్రత కోసం అందరూ కలిసి పనిచేయాలి. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు అందరూ ప్రధాని నాయకత్వాన్ని బలోపేతం చేయాలి" అని లోకేశ్ కోరారు. ఈ సమావేశంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు పులివర్తి రామాంజనేయులు (భీమవరం), కామినేని శ్రీనివాస్ (కైకలూరు) తదితరులు పాల్గొన్నారు.