Actress Anjali: 'గేమ్ చేంజర్' చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లోనే బెస్ట్ అవుతుంది: అంజలి

Actress Anjali Interesting Talk about Game Changer Movie

  • రామ్ చ‌ర‌ణ్, శంక‌ర్ కాంబోలో 'గేమ్ చేంజర్'
  • జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న సినిమా
  • చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన న‌టి అంజలి 
  • మూవీ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విషయాల‌ను పంచుకున్న హీరోయిన్‌

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ గ్రాండ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అంజలి మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివే..

సంక్రాంతికి మీ రెండు చిత్రాలు వస్తున్నాయి? దాని గురించి చెప్పండి?
ఏ యాక్టర్‌కి అయినా సరే సంక్రాంతికి సినిమా వస్తుందంటే ఆనందంగా ఉంటుంది. తెలుగులో గేమ్ చేంజర్, తమిళంలో విశాల్ చిత్రం రాబోతోంది. ఈ రెండు చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను.

గేమ్ చేంజర్‌లో మీ కారెక్టర్ గురించి చెప్పండి?
గేమ్ చేంజర్‌లో నా పాత్ర పేరు పార్వతి. మా అమ్మ పేరు కూడా పార్వతి. శంకర్ గారు కథ చెప్పినప్పుడు.. కారెక్టర్ పేరు చెప్పినప్పుడు మా అమ్మే గుర్తుకు వచ్చారు. ఆ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెబుదామని అప్పటి నుంచీ వెయిట్ చేస్తూనే వచ్చాను. ఈ కారెక్టర్ నా నుంచి చాలా డిమాండ్ చేసింది. నేను కూడా అదే స్థాయిలో నటించానని అనుకుంటున్నాను. శంకర్ గారు నా పెర్ఫార్మెన్స్‌ను చూసి చాలా చోట్ల మెచ్చుకున్నారు. ఇది నా కెరీర్‌లో ది బెస్ట్ చిత్రం, కారెక్టర్ అవుతుంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది.

మీ పాత్ర కోసం మీరు చేసుకున్న ప్రిపరేషన్స్ ఏంటి?
పార్వతి పాత్ర కోసం నేనేమీ ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వలేదు. నా పాత్రలో సస్పెన్స్, ట్విస్ట్ ఉంటుందని శంకర్ గారు ఆల్రెడీ చెప్పారు. కాబట్టి నేను ఆ కారెక్టర్‌ గురించి ఎక్కువగా చెప్పకూడదు. అది థియేటర్‌లో ప్రేక్ష‌కులు చూసినప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సెట్స్ నుంచి వచ్చినా కూడా ఈ పాత్ర చాలా రోజులు నన్ను వెంటాడుతూనే వచ్చింది. నా కెరీర్‌లో ఇదే బెస్ట్ కారెక్టర్.

మీ పాత్రకు నేషనల్ అవార్డు వస్తుందని అంతా అంటున్నారు?
నేను కూడా కథ విన్నప్పుడు అలానే అనుకున్నాను. నాక్కూడా అలానే అనిపించింది. అంతా అంటున్నట్టుగా అదే నిజమైతే అంతకంటే గొప్ప విషయం, సక్సెస్ ఇంకేం ఉంటుంది. ఆ దేవుడి దయ వల్ల అది నిజం కావాలి.

ఈ పాత్రను పోషించడంలో మీకు ఎదురైన సవాళ్లు ఏంటి?
బయటే జరిగే సంఘటనలు, ఎదురైన అనుభవాల నుంచే ఏ యాక్టర్ అయినా కూడా తెరపై నటించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ సినిమాలోని కారెక్టర్‌, ఆ బ్యాక్ డ్రాప్ చాలా కొత్తది. నాకు ఇలాంటి ఘటనలు, మనుషులు ఎప్పుడూ ఎదురు కాలేదు. చాలా కొత్తగా అనిపించింది. అందుకే ఈ పాత్రను పోషించేందుకు, నటనతో ఆడియెన్స్‌ను నమ్మించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. 

అప్పన్న పాత్రతో మీ జర్నీ ఎలా ఉండబోతోంది?
శంకర్ గారు నా పాత్ర గురించి చాలానే చెప్పారు. నా పాత్రలో చాలా సోల్ ఉంటుంది. ఎక్కువగా రివీల్ చేయొద్దనే ట్రైలర్, టీజర్‌లో తక్కువ షాట్స్ పెట్టారు. నా పాత్రను తెరపై చూసినప్పుడు ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా థ్రిల్ ఫీల్ అవుతారు. అప్పన్న, పార్వతీల ప్రేమ, వారి బంధం చాలా గొప్పగా ఉంటుంది. అదే ఈ సినిమాకు ప్లస్ అవుతుంది.

రామ్ చరణ్‌తో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?
రామ్ చరణ్ గారు తన కో-స్టార్స్‌కు కంఫ్టర్ట్ ఇస్తారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ చాలా కామ్‌గా ఉంటారు. సెట్స్‌లో అందరితోనూ బాగా ఉంటారు. అందరితోనూ చక్కగా మాట్లాడతారు. దిల్ రాజు గారి బ్యానర్, శంకర్ గారి సినిమా, రామ్ చరణ్ గారితో మొదటి సినిమా కావడంతో నాకు ఇలా అన్ని రకాలుగా ఈ చిత్రం ప్రత్యేకం. శంకర్ గారు, మణిరత్నం గారి చిత్రాల్లో నటించాలని అందరికీ ఉంటుంది. నాకు శంకర్ గారి చిత్రంలో ఛాన్స్ రావడం ఆనందంగా అనిపించింది.

గేమ్ చేంజర్ మీ లైఫ్‌కు గేమ్ చేంజర్ అవుతుందా?
గేమ్ చేంజర్ వల్ల నా ఆలోచనాధోరణి మారింది. ఈ ప్రయాణంలో ఎంతో మార్చుకున్నాను. ఇక నెక్ట్స్ ఎంచుకునే పాత్రలు, సినిమాల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఈ విషయంలో ఇది నాకు గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. చిరంజీవి గారు సినిమా చూసి నా పాత్రను మెచ్చుకున్నారని తెలిసింది. అదే నాకు పెద్ద అవార్డులా అనిపిస్తోంది.

రామ్ చరణ్ గారితో మీరు చేసిన సాంగ్ గురించి చెప్పండి?
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అరుగు మీద అంటూ ఓ పాటను రిలీజ్ చేశాం. ఇప్పటికే ఈ పాట రీల్స్‌లో ట్రెండ్ అవుతోంది. నాకే కాకుండా టీం అందరికీ కూడా అది ఫేవరేట్ సాంగ్. అది ఎప్పటికీ నిలిచిపోయే పాట. తమన్ నాకు ఇచ్చిన 'బలుపు', 'వకీల్ సాబ్' ఇలా అన్ని పాటలు ఎవర్ లాస్టింగ్‌గానే ఉంటాయి. ఇప్పుడు ఈ పాట కూడా ఎవర్ లాస్టింగ్‌గా నిలుస్తుంది. 

దిల్ రాజు గారి నిర్మాణంలో మళ్లీ నటిస్తుండటం ఎలా ఉంది?
దిల్ రాజు గారి నిర్మాణంలో నాకు ఎప్పుడూ గొప్ప చిత్రాలే వచ్చాయి. సీతమ్మ వాకిట్లో, వకీల్ సాబ్ ఇలా అన్నీ మంచి చిత్రాలే వచ్చాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ రాబోతోంది. ఇది కూడా చాలా మంచి చిత్రం అవుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నాకు హోం బ్యానర్ లాంటిది.

  • Loading...

More Telugu News