KA Paul: రేవంత్ రెడ్డికి ఢిల్లీ పెద్దలు సహకరించడం లేదు: కేఏ పాల్
- కేసీఆర్ రూ. 7 లక్షల కోట్ల అప్పు చేశారని కేఏ పాల్ విమర్శ
- రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపాటు
- రేవంత్ వచ్చిన తర్వాత అప్పులు మరింత పెరిగాయని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంతో చేయాలని ఉందని... కానీ ఢిల్లీ పెద్దలు ఆయనకు సహకరించడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదేళ్ల పాలనలో రూ. 7 లక్షల కోట్లు అప్పు చేశారని... రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో చేయాలని ఉన్నా... రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడం వల్ల అనుకున్నంతగా చేయలేకపోతోందని అన్నారు.
తెలంగాణ అప్పు తీర్చేందుకు మాట్లాడదామని రేవంత్ రెడ్డి తనతో అన్నారని... తాను అందుకు అంగీకరించానని కేఏ పాల్ చెప్పారు. రేవంత్ వచ్చిన తర్వాత అప్పులు మరింత పెరిగాయని... దీంతో ఎన్నికల వాగ్దానాలను కూడా అమలు చేయలేకపోతున్నారని అన్నారు. రేవంత్ వాగ్దానాలు ఫెయిల్ అయ్యాయి కాబట్టే తాను రంగంలోకి దిగానని చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కూడా ఎంతో చేయాలని ఉన్నప్పటికీ చేయలేకపోతున్నారని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.