magnesium: హైబీపీతో బాధపడుతున్నారా... మెగ్నీషియం మ్యాజిక్ తెలుసా?
- బీపీని అదుపులో ఉంచడంలో కీలకపాత్ర
- రక్తనాళాలు దెబ్బతినకుండా యాంటీ ఆక్సిడెంట్ల తరహాలో ప్రయోజనం
- అమెరికాలో జరిగిన కొన్ని అధ్యయనాల్లో వెల్లడి
రక్త నాళాలు గట్టిపడి సంకోచించినప్పుడు శరీరమంతా రక్తం సరఫరా అయ్యేందుకు వీలుగా రక్తపోటు (బీపీ) పెరుగుతుంది. ఈ సమస్యను వెంటనే చక్కదిద్దకపోతే దీర్ఘకాలంలో అది అవయవాల పనితీరుపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పక్షవాతం, గుండెపోటు, కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యకు మెగ్నీషియం చెక్ పెడుతుందని... బీపీని నిరంతరం అదుపులో ఉంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఏమిటీ మెగ్నీషియం?
మెగ్నీషియం అనేది మన శరీరానికి అవసరమైన ఖనిజ పదార్థం. శరీరం ప్రొటీన్లను, డీఎన్ఏను తయారు చేసుకోవడంలో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది. మనల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచడంలో, బీపీని నియంత్రించడంలో దోహదపడుతుంది. ముఖ్యంగా రక్తనాళాలు దెబ్బతినకుండా యాంటీ ఆక్సిడెంట్ తరహాలో పనిచేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు, కండరాలు, నరాల పనితీరును మెరుగుపరిచేందుకు సాయపడుతుంది. ఎముకల అరుగుదల (ఆస్టియోపొరోసిస్)ను నివారిస్తుంది.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
అమెరికాలో జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం హైబీపీకి చికిత్స పొందుతున్నప్పటికీ బీపీ నియంత్రణలో లేక ఇబ్బంది పడుతున్న వారిలో మెగ్నీషియం వాడకంతో సత్ఫలితాలు వచ్చాయి. రోజుకు 240 మిల్లీగ్రాముల నుంచి 607 మిల్లీగ్రాముల మెగ్నీషియం సప్లిమెంట్లను వాడిన వారిలో బీపీ అదుపులోకి వచ్చింది. అలాగే షుగర్ వ్యాధి రోగుల్లోనూ మెగ్నీషియం మందులతో బీపీ నియంత్రణ సాధ్యమైంది.
మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు
గుమ్మడి గింజలు, చియా సీడ్స్, బాదం పప్పు, పాలకూర, జీడిపప్పు, వేరుశనగ, నల్ల బీన్స్, ఎడమేమ్, పీనట్ బటర్, బంగాళదుంపలు
మెగ్నీషియం సప్లిమెంట్లు వాడొచ్చా?
వీలైనంత మేరకు ఆహారంలోనే మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ పోషకాల్లోని మెగ్నీషియం రోజువారీ పరిమాణం సరిపోకుంటే... వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు మెగ్నీషియం సప్లిమెంట్లను వాడాలని చెబుతున్నారు. బీపీ నియంత్రణలో మెగ్నీషియం ఆస్పరేట్, క్లోరైడ్, పిడోలేట్, అమైనో యాసిడ్ చీలేట్ సప్లిమెంట్లు బాగా పనిచేస్తున్నట్లు వైద్య నిపుణులు అంటున్నారు.
రోజుకు ఎంత మెగ్నీషియం అవసరం?
స్త్రీలు, పురుషులు తమ రోజువారీ పోషకాహారంలో తగినంత మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలి. 19 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య పురుషులైతే 400 మిల్లీగ్రాములు, 31 ఏళ్లు పైబడ్డ మగవారు అయితే 420 మిల్లీగ్రాముల మెగ్నీషియం తీసుకోవాలి. అదే 19 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండే స్త్రీలు అయితే 310 మిల్లీగ్రాములు, 31 ఏళ్లు పైబడిన ఆడవారు అయితే 320 మిల్లీగ్రాముల మెగ్నీషియం తీసుకోవాలి. మొత్తంమీద పెద్దలు ఎవరైనా మందుల రూపంలో 350 మిల్లీగ్రాములకు మించి మెగ్నీషియం తీసుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా?
ఆహారంలో ఎంత మెగ్నీషియం తీసుకున్నా ఏమీ కాదని వైద్యులు చెబుతున్నారు. కానీ సప్లిమెంట్ల రూపంలో మెగ్నీషియాన్ని నిర్దేశిత డోసుకన్నా ఎక్కువ మోతాదులో తీసుకుంటే విరేచనాలు, వికారం, పొత్తికడుపులో నొప్పి, అసాధారణ సందర్భాల్లో హృదయ స్పందనల్లో తేడాలు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. అందువల్ల తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి, వారు సూచించిన మేరకు మాత్రమే వాడాలని స్పష్టం చేస్తున్నారు.