BRS: కేటీఆర్ న్యాయవాదిని తీసుకు వెళతానంటే ఏసీబీ వాళ్లు ఎందుకు డ్రామా చేశారు?: క్రిశాంక్
- ఏసీబీ అధికారులు సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించారన్న క్రిశాంక్
- విచారణకు వెళ్లినప్పుడు న్యాయవాది పక్కన ఉండవచ్చని వ్యాఖ్య
- లేదంటే కేటీఆర్ విచారణకు సహకరించలేదని ఏసీబీ చెప్పవచ్చని అనుమానం
ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ అధికారులు సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కుడు బిళ్ల ఆడుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫార్ములా ఈ-రేస్ గురించి ఏం తెలుసునని ఎద్దేవా చేశారు. ఈరోజు క్రిశాంక్ మీడియాతో మాట్లాడుతూ... సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని విచారణకు పిలిచినప్పుడు న్యాయవాది పక్కన ఉండవచ్చన్నారు. న్యాయవాదిని తీసుకువెళతానని కేటీఆర్ అంటే ఏసీబీ వాళ్లు ఎందుకు డ్రామా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ తన వెంట న్యాయవాదిని తీసుకువెళ్లవచ్చన్నారు. కేటీఆర్ న్యాయవాదిని తీసుకొని వెళ్లకుంటే లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి వ్యవహారంలాగే తమకు నచ్చిన స్టేట్మెంట్ రాసుకుంటారన్నారు. కేటీఆర్ విచారణకు సహకరించడం లేదని కూడా కోర్టుకు చెప్పే అవకాశం ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో అసలు క్రిమినల్ వ్యవహారం ఎక్కడ ఉందని ప్రశ్నించారు.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌ను ఇక్కడకు తీసుకురావడమే కేటీఆర్ చేసిన తప్పా? అని నిలదీశారు. కశ్మీర్‌కు మోటార్ స్పోర్ట్స్ తీసుకువచ్చామని ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా చాలా గొప్పగా చెప్పుకున్నారని తెలిపారు. వాళ్లకు గొప్ప అయింది మనకు కాకుండా పోతుందా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు మొదటిసారి ఫార్ములా ఈ-రేస్ రావడం చాలా గొప్ప విషయమన్నారు. రేవంత్ రెడ్డి ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేదని, అందుకే ఆయన పేరును ఎవరూ గుర్తుకు పెట్టుకోరన్నారు. రేవంత్ రెడ్డి గొప్ప నటుడని, చాలా బాగా అబద్ధాలు చెబుతాడని విమర్శించారు.