Ramgopal Varma: 'శివ' ఎందుకు హిట్ అయిందో నాకు ఇప్పటికీ తెలియదు: రాంగోపాల్ వర్మ
- సిరివెన్నెలతో పరిచయం గురించి చెప్పిన వర్మ
- పాత 'మహర్షి' సినిమా తరువాత తమ పరిచయం జరిగిందని వెల్లడి
- 'సిరివెన్నెల' తాను ఇప్పటికీ చూడలేదని వ్యాఖ్య
- 'శివ' సినిమాలో ఆ రెండు పాటలే హిట్ అంటూ వివరణ
తన అభిప్రాయాలను... నిర్ణయాలను నిర్మొహమాటంగా చెప్పడం రాంగోపాల్ వర్మకి అలవాటు. తన సినిమాల విషయాలలోను అదే పద్ధతిని ప్రదర్శించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈటీవీ వారు సిరివెన్నెల సాహిత్యం గురించి నిర్వహిస్తున్న 'నా ఉఛ్చ్వాసం కవనం' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. "1987లో వచ్చిన 'మహర్షి' సినిమాలో 'సాహసం నా పథం' అనే పాట విన్న తరువాత నాకు సిరివెన్నెల గారి పేరు రిజిస్టర్ అయింది. అప్పటి నుంచే నేను సిరివెన్నెలగారిని గమనించడం మొదలుపెట్టాను" అని అన్నారు.
అప్పట్లో 'సిరివెన్నెల' వంటి పాటలను నేను వినేవాడిని కాదు. అందువలన ఆ సినిమాను కూడా చూడలేదు. అప్పుడప్పుడు నాకు... శాస్త్రిగారికి కొన్ని విషయాలపై మాటలు జరుగుతూ ఉండేవి. ఒకసారి నా సినిమా ఫ్లాప్ అయినప్పుడు, 'ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది?' అని ఆయన అడిగారు. 'సార్... శివ ఎందుకు హిట్ అయిందనేదే నాకు ఇంతవరకూ తెలియదు' అన్నాను. హిట్ అవుతుందనుకుని నేను 'శివ' తీసి ఉంటే, ఆ తరువాత ఫ్లాప్ ఎందుకు తీస్తాను? 'శివ' నేను తీశాను .. ఎవరెవరి అదృష్టాలో బాగుండి అది ఆడింది. ఆ సినిమా హిట్ కి .. నాకు సంబంధం లేదు అని చెప్పాను" అని అన్నారు.
" సిరివెన్నెల గారు వచ్చేసరికి వేటూరి గారే ఎక్కువ పాటలను రాస్తూ ఉన్నారు. 'శివ' సినిమాకి కూడా వేటూరిగారితోనే పాటలు రాయించాలని అంతా అనుకున్నారు. కానీ నేను మాత్రం రెండు పాటలు సిరివెన్నెల గారితో రాయించుకుంటానని చెప్పాను. ఈ విషయంలో నేను కాస్త గట్టిగానే పట్టుబట్టాను. అలా సిరివెన్నెల గారు రాసిన పాటలే 'బోటనీ పాఠముంది' .. 'సరసాలు చాలు శ్రీవారు'. ఒక్క కవితాత్మకమైన పదం కూడా లేకుండా, కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడుకునే మాటలతో పాట రాయమని శాస్త్రిగారితో అన్నాను. అప్పుడు ఆయన రాసినదే 'బోటనీ పాఠముంది'. ఆ సినిమా మొత్తంలో ఆయన రాసిన ఆ రెండు పాటలే జనానికి గుర్తుండిపోయాయి" అని చెప్పారు.