Ramcharan: అభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం... మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం
- రాజమహేంద్రవరంలో 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఈ వేడుకలో పాల్గొని తిరిగి ఇంటికి వెళుతుండగా రోడ్డు ప్రమాదం
- ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ అనే అభిమానుల మృతి
- మృతుల కుటుంబాలకు చెరో రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన చెర్రీ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'గేమ్ ఛేంజర్'. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా శనివారం నాడు రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు అభిమానులు హాజరయ్యారు. అయితే, వేడుక ముగిసిన తర్వాత వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ ఢీకొట్టడంతో చనిపోయారు.
అభిమానుల మృతి విషయం తెలుసుకున్న రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి సన్నిహితులతో పాటు తన మనుషులను పంపించి ధైర్యం చెప్పించారు. మృతుల కుటుంబాలకు చెరో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ... ''ఈవెంట్ దగ్గరకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం. మన ఏపీ డిప్యూటీ సీఎం, బాబాయి పవన్ కల్యాణ్ కోరుకునేది కూడా అదే. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. అభిమానుల కుటుంబాలు ఎంత బాధపడతాయో అర్థం చేసుకోగలను. నాకూ అంతే బాధగా ఉంది. అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియస్తున్నాను'' అని అన్నారు.
ఇక ఇప్పటికే మృతుల కుటుంబాలకు నిర్మాత దిల్ రాజు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. దిల్ రాజు చెరో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించగా... పవన్ కూడా రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే ప్రభుత్వం తరఫున కూడా తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ అధికారులను జనసేనాని ఆదేశించారు.